రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

Dec 23,2023 21:16

ప్రజాశక్తి-విజయనగరం మిల్లర్లు రంగు మారిన ధాన్యాన్ని వెనక్కి పంపితే సహించేది లేదని, రైతుల నుండి వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేయాలనీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలుపై ఎలాంటి ఫిర్యాదులు అందినా ఆ మిల్లుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం చైర్మన్‌ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగింది. సమావేశం లో పాల్గొన్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ రైతులకు అన్‌లోడ్‌ ఛార్జీలను, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం డబ్బులు 2 లేదా 3 రోజుల్లోనే వేస్తున్నామన్నారు. జిల్లాలో ఇంతవరకు 63 వేల 845 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేసి 11,326 మంది రైతులకు బిల్లులు చెల్లించా మన్నారు. సుమారు 100 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా 82 కోట్ల రూపాయలచెల్లింపులు జరిగాయన్నారు. సుమారు 19 లక్షల గోనె సంచులను సరఫరా చేశామన్నారు. ఎఆర్‌బికె పరిధిలో ఎక్కువగా అవసరం ఉందో ఇండెంట్‌ పెడితే అక్కడ ఎక్కువగా గన్నీలు సరఫరా చేస్తామన్నారు. సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతుల సమస్యలను పరిష్కరించడానికి కంట్రోల్‌ రూమ్‌ ను ఏర్పాటు చేశామన్నారు. మిల్లర్ల నుండి ఏవైనా కొర్రీలు ఉంటె కాల్‌ సెంటర్‌ కు రైతులు నేరుగా ఫోన్‌ చేయాలని తెలిపారు. మొక్కజొన్న సేకరణకు కూడా ఉత్తర్వులు అందాయని ఈ ఏడాది సుమారు 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ను అంచనా వేస్తున్నామని తెలిపారు. సమావేశంలో డిసిఎంఎస్‌ చైర్మన్‌ అవనాపు భావన, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామా రావు, పశు సంవర్ధక శాఖ జెడి విశ్వేశ్వర రావు , మత్స్య శాఖ డిడి నిర్మలా కుమారి, ఎఎబి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

➡️