రక్తహీనత రహిత జిల్లాగా ఆవిర్భవించాలి

Feb 7,2024 21:17

ప్రజాశక్తి -పార్వతీపురం : రక్తహీనత రహిత జిల్లాగా ఆవిర్భవించాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. జిల్లాలో ప్రిజమ్‌ – 10 ప్రాజెక్టు అమలు, అభిలాష తదితర అంశాలపై మండల అధికారులతో జిల్లా కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ బుధవారం సమీక్షించారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్య నివారించుటకు ఎంపిడిఒ పర్యవేక్షణలో గ్రామ, వార్డు స్థాయిలో ఆశా, ఎఎన్‌ఎం, అంగన్వాడి కార్యకర్త, మహిళా పోలీసుతో బృందాన్ని ఏర్పాటుచేశామన్నారు. రక్తహీనత గల గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలను గుర్తించి క్రమం తప్పకుండా ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు పంపిణీ చేయడం, పౌష్టికాహారం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రక్తహీనత రహిత జిల్లాగా ఆవిర్భవించాలని చెప్పారు. హై రిస్క్‌ కేసులు అనేకం నివారించామన్నారు. సంబంధిత జాబితా ప్రతి సచివాలయంలో ఉందని తెలిపారు. పాచిపెంట మండలం మంచి పనితీరు కనబరిచిందని ఆయన ప్రశంసించారు. మాత, శిశు మరణాలు నియంత్రణ ముఖ్య ధ్యేయంగా ప్రిజమ్‌ను జిల్లాలో ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గర్భిణులను గుర్తించాలని, నమోదు చేయాలని వారిలో రక్త హీనత నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆశాలు ఇంటింటికీ వెళ్లి గర్భిణులను గుర్తించాలని ఆయన ఆదేశించారు. తద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆర్థిక సహాయం, వైద్యం అందుతుందన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించే ప్రదేశాల్లో అవగాహన కల్పించాలని స్పష్టంచేశారు. టేక్‌ హోం రేషన్‌ను గర్భిణులు మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు. ఇమ్యూనైజేషన్‌ శత శాతం జరగాలని స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల స్పందనను సంబంధిత యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. కిల్కారి వాయిస్‌ కాల్‌ను ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు. 9న డి వార్మింగ్‌ డే ఈ నెల 9న డి వార్మింగ్‌ డేను విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారికి ఆల్‌ బెండజోల్‌ మాత్రలు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం యువతకు భరోసాగా నిలుచుటకు ‘అభిలాష’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామ సచివాలయాలలో అభిలాష గ్రంథాలయాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. గ్రంథాలయాల్లో 66 రకాల పుస్తకాలను రెండు సెట్లు చొప్పున ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథ రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రరావు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి నారాయణరావు, ప్రీజమ్‌ నోడల్‌ అధికారి ఎం.వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️