రక్షణ గోడ నిర్మాణంతో తొలగిన ఇక్కట్లు

 ప్రజాశక్తి -తగరపువలస : జివిఎంసి రెండో వార్డు పరిధి గ్రంథాలయం వీధిలో ఉన్న సత్యనారాయణపేట కొండవాలు ప్రాంతంలో ఎట్టకేలకు ఇటీవలే రక్షణ గోడ నిర్మించడంతో కొండవాలు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. జివిఎంసి నిధులు రూ.74 లక్షలతో 2023 జనవరి 19న రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి చేశారు. రక్షణ గోడ నిర్మాణం చేపట్టకుంటే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇక్కడున్న ప్రజలు బెంబేలెత్తి ఉండేవారు.గుర్తుచేసుకుంటున్న చేదు అనుభవాలు తుపాన్లు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇక్కడున్న కొండవాలు ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటారు. గతేడాది మే 26న మట్టి పెల్లలు విరిగి పడడంతో ఆందోళనకు గురైన విషయం విదితమే. అదే ఏడాది సెప్టెంబర్‌ 8న మరో ఘటన జరిగిన సంగతి తెలిసిందే. హుదూద్‌ తుపాను అనంతరం కొండ వాలు ప్రాంతంలో కుడివైపు నిర్మించిన చిన్న పాటి రక్షణ గోడ కూలడంతో 4 కుటుంబాలు అర్ధరాత్రి వేళ అక్కడే ఉన్నసామాజిక భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో తల దాచుకున్నారు. ఈ ఘటనలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయని కొండవాలు ప్రాంత ప్రజలు మంగళ వారం ప్రజాశక్తి వద్ద వాపోయారు.

➡️