రబీ పనుల్లో బిజీగా రైతులు

రబీ

ప్రజాశక్తి-మండపేట ఖరీఫ్‌ సీజన్‌లో వరి దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు రబీ పంట కోసం సిద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ఆకుమడి, వెదజల్లేందుకు వ్యవసాయ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఆలమూరు డివిజన్‌ పరిధిలోని మండపేట, ఆలమూరు, రాయవరం మండలాల్లోని 56,104 ఎకరాల్లో వరి పంటను వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. డిసెంబర్‌ మొదటి వారం నాటికి ఆకుముడులు, వెదజల్లు ప్రక్రియను పూర్తి పూర్తిచేసుకుని డిసెంబర్‌ నెలాఖరు నాటికి వరి నాట్లు వేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా పంట చేలను ట్రాక్టర్లతో దున్నుతున్నారు. మేలు రకాల విత్తనాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదిస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని పలువు రైతులు కోరుతున్నారు. ఎక్కడికక్కడ ధాన్యం ఎగుమతులు నిలిచి పోయి ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. కళ్లాల్లోని ధాన్యం తడిసి పోకుండా ఉండేందుకు బరకాలు కప్పి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మునిగిపోయారు.

➡️