రహదారి ధ్వంసం దారుణం

ప్రజాశక్తి-సత్తెనపల్లి : సత్తెనపల్లిలో అమరావతి మేజర్‌ పెద్దకాలవ కుడివైపు రోడ్డును తవ్వటమే కాక బారీకేడ్లు పెట్టి రైతులకు పంట పొలాలకు వెళ్లే దారులను ధ్వంసం చేయడం దారుణమని, గుంతలను సత్వరమే చదును చేయడంతోపాటు బారీకేడ్లను తొలగించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య డిమాండ్‌ చేశారు. ఇటీవల ఓ సామాజిక తరగతికి చెందిన వారు వనభోజనాలు నిర్వహించుకునేందుకు అమరావతి మేజర్‌ కాల్వ సమీపంలోని ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు కుడివైపు కాల్వను కొంత దూరం శుభ్రం చేసి మట్టిని తోలించారు. ఇదిలా ఉండగా మూడ్రోజుల క్రిత అధికారులు ఆ కాల్వ కట్టలను తవ్వారని, ఎవరూ వెళ్లకుండా బారీకేడ్లు పెట్టారని తెలుసుకున్న సిపిఎం నాయకులు ఆ ప్రదేశాన్ని శనివారం పరిశీలించారు. చలమయ్య మాట్లాడుతూ పొలాలకు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు తీయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వను పాడుచేసిన అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, ఉన్నత అధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒక సామాజిక తరగతి వనభోజనాలను అడ్డుకోవడానికి మంత్రి అంబటి రాంబాబు ఆదేశాలతోనే కెనాల్‌ అధికారులు ఇలా చేసినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఒకరోజు వనభోజనాలకి ఉపయోగ పెట్టుకుంటే మిగతా అన్ని రోజులు రైతులు తమ పొలాలకు వెళ్లడానికి మార్గం అదేనని, ట్రాక్టర్లు, అరకలు, వ్యవసాయ కూలీలు వెళ్లడానికి అదే ప్రధాన మార్గమని చెప్పారు. పాడుచేసిన రోడ్డును తక్షణమే బాగు చేయకుంటే రైతుల తరఫున సిపిఎం పోరాడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు డి.విమల, పి.మహేష్‌, నాయకులు జి.బాలకృష్ణ, జి.సుసులోవ్‌, పి.ప్రభాకర్‌, పి.రామారావు పాల్గొన్నారు.

➡️