రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనుల నిరసన

నిరసన తెలుపుతున్న పిప్పలదొడ్డి, గొడుగుమామిడి గ్రామాల గిరిజనులు

ప్రజాశక్తి -సీలేరు

జీకే వీధి మండలం దామనపల్లి పంచాయతీ పిప్పలదొడ్డి, గొడుగు మామిడి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం ఆ గ్రామ గిరిజనులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం తిప్పలదొడ్డి బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా నేటికీ తమ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిర్మిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప ప్రభుత్వంగాని, ప్రజాప్రతినిధులుగాని, అధికారులుగాని ఆ హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్యం సరికాదన్నారు. పిప్పళ్ళదొడ్డి నుంచి గొడుగుమామిడి వరకు కంకర వేసి తారు రోడ్డు వేయకుండా విడిచి పెట్టారని ఆరోపించారు. లింగవరం, మోదుగు బంద, తిప్పలదొడ్డి, గొడుగు మామిడి మీదగా దామనాపల్లి లంకవీధి వరకు తారు రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించుకుంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాగిన రామచంద్ర, మురళి, చెన్నారావు, సాగిన చిన్నయ్య పడాల్‌, సాగిన శ్రీహరి, సిందేరి రాజు, మరి అప్పలరాజు, పాంగి సన్యాసిరావు, దుక్కేరి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️