రహదారుల నిర్మాణంతోఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి

Feb 4,2024 21:18

ప్రజాశక్తి-పాచిపెంట: ఏజెన్సీ ప్రాంతాల్లో పక్కా రహదారుల నిర్మాణంతో మైదాన ప్రాంతాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర తెలిపారు. గిరిజనులకు విద్య, వైద్యం మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. ఆదివారం ఏజెన్సీ ప్రాంతాల్లో పలు రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మండలంలోని పద్మాపురం, కర్రివలస, ఆజూరు పంచాయతీల్లో రొడ్డవలస నుంచి కంకణపల్లి వరకు 1.7 కిలోమీటర్ల మేర రూ.1.35 కోట్లతో నిర్మిస్తున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్‌ 43 నుంచి కరడవలస వరకు రూ.4.96 కోట్లతో నిర్మించిన ఏడు కిలోమీటర్ల రోడ్డు, ఆజూరు నుండి పందిరిమామిడి వలస వరకు రూ.2.24 కోట్లతో నిర్మించిన 3.8 కిలోమీటర్ల బిటి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆజూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. నాలుగు పంచాయతీలకు సంబంధించి సుమారు తొమ్మిది కోట్లతో రహదారుల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. మండలంలో గత 20 రోజుల్లో 13 రహదారులు, వంతెనలకు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశామన్నారు. మరో మూడు రహదారు లకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రహదారుల నిర్మాణంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పంటలను తరలించి, గిట్టుబాటు ధరకు విక్రయించవచ్చునని తెలిపారు. రోడ్లతోపాటు సెల్‌ టవర్లు ఎక్కడికక్కడే నిర్మించామని తెలిపారు. ఎమ్మెల్యేగా భంజ్‌దేవ్‌, ఎమ్మెల్సీగా సంధ్యారాణి.. గిరిజన ప్రాంతాలకు, గిరిజనులకు చేసిందేమీ లేదన్నారు. ఐదేళ్లకు ఒకసారి గ్రామాల్లో తిరిగి కల్లబొల్లి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తారని ధ్వజమెత్తారు. అటువంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ కె.సింహాచలం, వైస్‌ ఎంపిపిలు ఎం.నారాయణ, కె.రవీంద్ర, జి.ముత్యాల నాయుడు, డోల బాబ్జి, పి.వీరంనాయుడు, దండి శ్రీనివాసరావు, టి.గౌరీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️