రాజధాని రైతులకు ఊరట

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : నాలుగేళ్లుగా ఉదమిస్తున్న అమరావతి రైతులకు భారీ ఊరట లభించింది. అమరావతి ఏకైక రాజధానిగా గుర్తించామని, మూడు రాజధానుల ప్రతిపాదనకు తమ ఆమోదం లేదని కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే అమరావతి మాస్టర్‌ప్లాన్‌కు కూడా ఆమోదం తెలిపామని ఇందులో ఎటువంటి మార్పులూ లేవని పేర్కొంది. ఈ ప్రకటనతో అమరావతి రైతుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమయ్యాయి. దేశంలోని 26 రాష్ట్రాలకు రాజధానుల జాబితాను విడుదల చేయగా ఇందులో ఎపికి అమరావతినే రాజధానిగా గుర్తించింది. 2014లో అప్పటి టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ)ను ఏర్పాటు చేసింది. సిఆర్‌డిఎ ద్వారా రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాల భూమిని సమీకరించింది. భూ సమీకరణ విధానం ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూములకు ప్రతిగా గృహ అవసరాల, వాణిజ్య అవసరాల వినియోగం నిమిత్తం రిటర్న్‌బుల్‌ ప్లాట్లు ఇచ్చేలా రైతులతో సిఆర్‌డిఎ ఒప్పందం చేసుకుంది. మొత్తం 34 వేల ఎకరాల భూమికి 54 వేల రిటర్నుబుల్‌ ప్లాట్లును ఏర్పాటు చేస్తూ రాజధాని గ్రామాల్లో లేఅవుట్‌లను ఏర్పాటు చేసింది. వీటిని మూడేళ్లలో అభివృధ్ధి చేసి ఇస్తామని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. 2019లోగా రిటర్నుబుల్‌ ప్లాట్లను రైతులకు అప్పగించకుండానే టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని విస్మరించింది. ఆరు నెలలు కాలయాపన చేసిన తరువాత 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారు.బిల్లు ఆమోదం పొందిన తరువాత రైతులు ఉద్యమ బాట పట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగేళ్ల పాటు నిరంతరాయంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వివిధ దశల్లో న్యాయపోరాటం చేశారు. సుదీర్ఘకాలం విచారణ తరువాత గత ఏడాది మార్చి 3న మూడు రాజధానుల చట్టాన్ని కొట్టివేస్తూ అమరావతిని ఆరునెలల్లోగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజధాని అభివృద్ధిపై కాలపరిమితి విధించడం సరికాదని పేర్కొంటూ ఈ అంశంపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ మూడు రాజధానుల చట్టం రద్దు, రైతుల ఇతర డిమాండ్లపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా విచారణ కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం అటు రైతులు, ఇటు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగానే గత నాలుగు నెలలుగా పలు దఫాలుగా విశాఖపట్నంకు పరిపాలన కేంద్రంను తరలించేందుకు సిఎం జగన్‌ పలు తేదీలు ప్రకటించినా ఆచరణ సాధ్యంకాలేదు. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వస్తుందా లేదా అన్న సంశయం లేకపోలేదు. ఈ ఏడాది వార్షిక కౌలు కూడా ప్రభుత్వం ఇంత వరకు రైతులకు ఇవ్వలేదు. రిటర్నుబుల్‌ ప్లాట్‌ల అప్పగింతలో జరిగిన జాప్యం వల్ల రైతులకు ఆర్థికంగా ఎంతో నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు అన్ని స్థాయిలో ఇప్పటికే వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళనలను కొనసాగించారు. తాజాగా కేంద్రం ఇచ్చిన ప్రకటనతో అమరావతికి ఎటువంటి ఢోకా లేదని రైతుల్లో ధీమా వ్యక్తం అవుతోంది.

➡️