రాజయ్యకు బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డు అందజేత

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: స్వామి వివేకానంద జాతీయ యూత్‌ ఐకాన్‌ అవార్డు యర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపికి చెందిన వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మా రాజయ్యకు బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డు వరించింది. వల్లూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మహనీయుల అవార్డుల మహోత్సవం-2024 కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్‌, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవాజ్ఞ శర్మ చేతుల మీదుగా వివేకానంద నేషనల్‌ బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గత రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తూ వారి హక్కుల కోసం నిరంతరం పరితపిస్తున్న తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. జీవితాంతం వికలాంగుల హక్కుల కోసం పోరాడుతానని తెలిపారు.

➡️