రాజీయే ఉత్తమ మార్గం

Dec 9,2023 20:46

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  :  కేసులు సత్వర పరిష్కారానికి రాజీ మార్గం అనుసరించడమే ఉత్తమ మార్గమని సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.యజ్జ నారాయణ అన్నారు. శనివారం స్థానిక కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించుకొనేలా జాతీయ లోక్‌ అదాలత్‌ ఏర్పాటు చేశామన్నారు. ఇటువంటి అవకాశం కల్పించడం వల్ల కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు ఆదా చేసుకుని సత్వర న్యాయం పొందవచ్చని అన్నారు. లోక్‌అదాలత్‌లో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రమేష్‌, అడిషనల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ డి.సౌజన్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్‌.శ్రీనివాసరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చంద్రకుమార్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు, సీనియర్‌ న్యాయవాదులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా అదాలత్‌ ద్వారా ఎపిసి కేసులు 66, ఎన్‌ఐ యాక్టు కేసులు 7, ఎక్సైజ్‌ 21, సివిల్‌ 15, ఫ్యామిలీ 6, ఎస్‌టిసి కేసులు 1514, ఫైన్‌కు సంబంధించిన కేసులు 103 పరిష్కారమయ్యాయి.కురుపాం : కేసులు సత్వర పరిష్కారానికి రాజీ మార్గం అనుసరించడమే ఉత్తమ మార్గమని స్థానిక జుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మద్ది రోహిణిరావు అన్నారు. శనివారం స్థానిక కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్‌ లో ఉన్న ఎస్‌టిసి కేసులు 157, 336 ఐపీసీ అడ్మినిస్ట్రేషన్‌ కేసులు 20, లేబర్‌ కేసులు 2 పరిష్కరించామన్నారు. ఈ కేసుల్లో జరిమానా రూ.40వేలు విధించామని కేసులు త్వరితగతిన పరిష్కరించుకునేలా జాతీయ లోక్‌అదాలత్‌ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్‌ సభ్యులు బి.చంద్రమౌళి, ఐ.వాసుదేవరావు, న్యాయవాదులు పోలీసులు కక్షదారులు పాల్గొన్నారు.సాలూరు: జాతీయ లోక్‌అదాలత్‌ సందర్భంగా శనివారం స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో నిర్వహించిన అదాలత్‌లో 109 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తి కె.రమేష్‌ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో 109 సివిల్‌, క్రిమినల్‌, మనోవర్తి, ఎక్సైజ్‌ కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు తాడ్డి తిరుపతి రావు, లోక్‌ అదాలత్‌ సభ్యులు నారాయణరావు పాల్గొన్నారు.

➡️