రాజ్యసభకు ‘మేడా’!

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రాజంపేట అర్బన్‌ రాజంపేట ఎమ్మెల్యే సోదరుడు, ప్రముఖ కాంట్రాక్టర్‌ మేడా రఘు నాధరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం లభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ .జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాష్ట్రానికి దక్కిన మూడు రాజ్యసభ అభ్యర్థిత్వాల పేర్లను ఖరారు చేశారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడైన రఘునాథరెడ్డి పేరు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే మేడా అభిమానులు, వైసిపి కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అభ్యర్థిత్వాల కోసం చేపట్టిన సర్వేల్లో వెనుకబడిన నేపథ్యంలో సమన్వకర్తత్వాన్ని నిరాకరించారు. ఎమ్మెల్యే మేడా స్థానంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమరనాధరెడ్డిని నియమించారు. ఇద్దరి నాయకుల మధ్య విభేదాలు, గ్రూపులు తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో అధికార వైసిపి పట్టు సడలకుండా చేయడంలో భాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కుటుంబానికి రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. ఎమ్మెల్యే మేడా కుటుంబీకులు, ఆకేపాటి అమరనాధరెడ్డితో సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్యేగా గెలిపించుకుని రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఆర్థికపరమైన ఖర్చుల దగ్గర నుంచి అసమ్మతుల సమస్యలను సమిష్టిగా పంచుకుని గెలుపే ధ్యేయంగా పని చేసే బాధ్యతల్ని అప్పగించినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి సమిష్టిగా ప్రచారాల్ని సైతం నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతుండడం గమనార్హం.సిఎంను కలిసిన మేడా రాఘనాథరెడ్డిప్రముఖ పారిశ్రామికవేత్త మేడా రఘునాథరెడ్డి గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. వైసిపి అధిష్టానం తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ తనపై ఉంచిన నమ్మకం వమ్ము చేయకుండా పార్టీకి సేవ చేస్తామన్నానని తెలిపారు.

➡️