రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాలి : కాకాణి

Nov 26,2023 20:18
అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మంత్రి

అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మంత్రి
రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాలి : కాకాణి
ప్రజాశక్తి -నెల్లూరు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం అనంతరం 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని స్వీకరించి ఆమోదించగా, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్‌ 29ని దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ మనకు అందించిన అతిపెద్ద రాజ్యాంగంతో భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తూ, దేశాన్ని అభివద్ధి పథంలో పయనించేలా రాజ్యాం గాన్ని మనకు అందించిన అంబేద్కర్‌ సేవలు చిరస్మరణీయమన్నారు. ఆ మహనీయునికి నివాళిగా, ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండేలా విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారికి దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

➡️