రామదుల చెరువుపై రాబందులు

ప్రజాశక్తి – గుర్ల : కబ్జాదారుల అక్రమాలు రోజు రోజుకూ పెచ్చుమీరుపోతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూములు, కొండపోరం బోకు భూములు, డీ పట్టా భూములు కనిపించినా వెంటనే పాగా వేసేస్తున్నారు. పై పెచ్చు తమకు మంత్రి తెలుసు, జిల్లా పరిషత్తు చైర్మన్‌ తెలుసు, ఉన్నతాధికారులు తెలుసు అని బెదిరించి దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములు అయిపోయాయేమో ఇప్పుడు ఏకంగా చెరువులపైనే పడ్డారు. ఇష్టానుసారంగా చెరువులను కబ్జా చేసి లే అవుట్లగా మార్చుకుంటున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు వత్తాసు పలకడంతో కబ్జాదారుల ఆగడాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగిపోతుంది.మండలంలో గూడెం రెవెన్యూ పరిధిలో గల రామదుల చెరువును దర్జాగా కబ్జా చేస్తున్నా ఎవరూ పట్టించికోవడం లేదని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద సుమారు 20 ఎకరాలు భూమిని రైతులు సాగుచేస్తున్నారు. ఈ చెరువు నుంచి వచ్చిన సాగునీటిపైనే ఈ భూములన్నీ ఆధారపడి ఉన్నాయి. ఇటువంటి చెరువుపై కొంత మంది అక్రమార్కులు కన్నేశారు. స్థానిక రెవెన్యూ సిబ్బందిని చేతులో పెట్టుకొని కబ్జా వ్యహారం నడిపిస్తున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు రామదుల చెరువుకు ఆనుకొని కొంత భూమిని కొనుగోలు చేశారు. చెరువును పూడ్చి వేస్తే మొత్తం భూమి అంతా తమ ఆధీనంలోకి వస్తుందని నిర్ణయించుకున్నారు. దీంతో పక్కనే ఉన్న రామదుల చెరువును తమ బినామిలా పేరు మీద రికార్డుల్లోకి నమోదు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్‌ 189-2లో 3.26 ఎకరాల విస్తీర్ణం గల రామదుల చెరువును రెవెన్యూ రికార్డుల స్కచ్‌లో రామదుల చెరువు అని ఉండగా, ఎఫ్‌సిఒలో జిరాయితి అనీ ఉండడంతో రెవెన్యూ లీలలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఈ చెరువు అభివృద్ధి కోసం ఉపాధిహామ పధకంలో నిధులు మంజూరు చేసి పనులు చేపట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ సిబ్బంది అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి అనుమతులూ లేకపోయినావాల్టా చట్టం ప్రకారం చెరువును కప్పడానికి రెవెన్యూ అధికారుల నుండి అనుమతులు తీసికోవలసి ఉంది. వాల్టా చట్టం ప్రకారం చెరువులను సంరక్షించ వలసిన రెవెన్యూ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండానే దర్జాగా చెరువును కప్పేస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.పరిశీలించి చర్యలు తీసుకుంటాంగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 189-2లో ఉన్న 3.26 ఎకరాలు భూమి స్కెచ్‌లో రామదుల చెరువుగా ఉంది. ఎఫ్‌సిఒ, ఎండిఆర్‌లో జిరాయితీగా ఉంది. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియచెసి వారి ఆదేశాలు ప్రకారం చర్యలు తీసుకుంటామం. పద్మావతి, తహశీల్దార్‌, గుర్ల

➡️