రాహుకేతువులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుపిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి

ప్రజాశక్తి-పీలేరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయని, పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌. తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం పీలేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.115లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని అప్పుల భారత్‌గా తయారు చేశారని విమర్శించారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియా ఈజ్‌ ఫర్‌ సేల్‌ అంటూ అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. కేంద్రం పరిధిలో ఉన్న 14లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అవి ఎవ్వరికి ఇవ్వలేదని అన్నారు. మోడీ ప్రభుత్వంలో ‘అచ్చే దిన్‌’ బదులు చచ్చే దినాలొచ్చాయని, ‘సబ్‌ కా వికాస్‌’ బదులు సబ్‌ కా వినాష్‌ జరుగుతూందని అన్నారు. ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లాంటి సంజీవినీకి పంగనామాలు పెట్టి, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చిందని పేర్కొన్నారు. జిల్లా స్టీల్‌ ప్లాంట్‌కు స్వస్తి పలికి మోడీ ద్రోహం చేశారని, దుగరాజపట్నం ఓడరేవు ఊసే లేదని, పోలవరం ప్రశ్నర్థకంగా మారిందని చెప్పారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాలు సామాన్య మానవులకు అందుబాటులో లేకుండా, అతనికంటే ఘనుడునిపించుకుంటున్నాడని ఎద్దేవ చేశారు. ఆయన దేశాన్ని అప్పుల పాలు చేస్తే ఈయన లక్షల కోట్లరూపాయలు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పులాంద్ర ప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. అలాగే రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని, రౌడీలు రాజ్యమేలుతున్నారని, పూటకో రౌడీ, పేటలో రౌడీ తయారుచేశారన్నారు. ల్యాండ్‌ మాఫియా, శాండ్‌ మాఫియా, వైన్‌ మాఫియా, మైన్‌ మాఫియా అంటూ మాఫియా రాజ్యంగా మారిందన్నారు. విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటిపన్నులతో బాదుడే బాదుడు అంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా, విద్యార్థుల పట్ల కంస మామగా తయారయ్యారని, మాట తప్పడం మడమతిప్పడం దిన చర్య అయిందని, నవరత్నాలు నకిలీ రత్నాలుగా మారాయని అన్నారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అల్లాభకష్‌, ప్రధాన కార్యదర్శి శ్రీవర్ధన్‌ చౌదరి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు బాలిరెడ్డి సోమశేఖర్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తేజ, మండల అధ్యక్షులు శ్రీకాంత్‌, మల్లికార్జున పాల్గొన్నారు.

➡️