రెండో రోజుకు పెన్షనర్ల దీక్షలు

ప్రజాశక్తి -కరాస : ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన మర్రిపాలెంలోని పిఎఫ్‌ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. రెండో రోజు దీక్షలో జింక్‌ స్మెల్టర్‌ పెన్షనర్లు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి సంఘం సీనియర్‌ నాయకులు ఎస్‌.కనకేశ్వరరావు మాట్లాడుతూ, 14 సంవత్సరాల నుంచి ఇపిఎఫ్‌ 95 పెన్షనర్లు అలుపెరగని పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. ఇప్పటికి 30 లక్షలు మందికి వెయ్యి రూపాయల లోపు పెన్షన్‌ వస్తుందని, దీనికి తోడు ఆరోగ్య సమస్యలు, అధిక ధరలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కె.హుస్సేన్‌, కెపి.కుమార్‌, శ్రీనివాస్‌మూర్తి, సూర్యప్రకాష్‌, ఎన్‌.రామలింగేశ్వర, బిటి.మూర్తి, టి.భాస్కరరావు, వెంకటేశ్వరరావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️