రేపు గ్రూప్‌-2 పరీక్ష

Feb 24,2024 00:23

గుంటూరులో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల ఆదివారం నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 25వ తేదిన జరిగే గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డిఆర్‌ఓ పెద్ది రోజా, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్షన్‌ అధికారులు అమ్మాజీ, కె.సురేష్‌తో కలిసి చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, రూట్‌ ఆఫీసర్లు, లైజన్‌ ఆఫీసర్లు, అబ్జర్వర్లతో సమీక్షించారు. సర్వీస్‌ కమిషన్‌ సెక్షన్‌ అధికారి అమ్మాజీ పరీక్షకు 56 కేంద్రాల్లో 28,209 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. వికలాంగ అభ్యర్థుల కోసం పరీక్షా కేంద్రంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సీటింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష హాళ్ళలో సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9.30 నుండి పది గంటల వరకు చేరుకోవలసి ఉంటుందన్నారు. గ్రేస్‌ పీరియడ్‌తో పాటు కలిపి 15 నిమిషాలు ఉంటుందని, కావున ఉదయం 10.15 గంటల వరకు వచ్చిన అభ్యర్దులను మాత్రమే పరీక్ష హాళ్లకు అనుమతించాల్సి ఉంటుందని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జారీచేసిన సూచనలను పాటించి ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. అభ్యర్థులు పరీక్ష హాల్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ ఫోన్లను, పుస్తకాలను తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు పరీక్ష ముగిసే వరకు అనగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష హాల్‌లోనే వుండాల్సి ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. అభ్యర్దులు హాల్‌ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజనల్‌ ఫోటో గుర్తింపు కార్డు (పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలైనవి)ను పరీక్షా కేంద్రాల వద్ద అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల సౌకర్యార్ధం కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ (0863-2234014) ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నరసరావుపేటలో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ మాట్లాడారు. జిల్లాలో 9778 మంది పరీక్షకు హాజరవుతున్నారని, నరసరావుపేటలో-25, సత్తెనపల్లి-2, చిలకలూరిపేటలో ఒక పరీక్ష కేంద్రంలో పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని, తాగునీరు, నిరంతర విద్యుత్‌, మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, జిల్లా రెవిన్యూ అధికారి అజరు కుమార్‌, రెవెన్యూ డివిజినల అధికారులు రమణకాంతరెడ్డి, మురళి పాల్గొన్నారు.

➡️