రేపు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు

ప్రజాశక్తి-కడప అర్బన్‌ రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు 38 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిరవధిక దీక్ష చేపట్టిన సందర్భంగా వారికి సంఘీభావంగా 20వ తేదీ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సిఐటియు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోహర్‌, ఎల్‌.నాగసుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమని తెలిపారు. 38 రోజులుగా సమ్మె చేస్తూ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం అన్యాయమని తెలిపారు. మహిళా సాధికారిత అని చెప్పి మహిళలు పోరాటం చేస్తే అంగన్వాడి మహిళలను పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. గత నెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న జీతం పెంచకపోవడం ఘోరమని తెలిపారు. అంగన్వాడీల పట్ల చిన్నచూపు తగదన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల జీతాలు పెంచి సమ్మెను నివారించాలని కోరారు. షోకాజ్‌ నోటీసులతో బెదిరించడం ఇంతకన్నా దారుణంగా లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. వారికి మద్దతుగా 19న స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలి, 20న జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, జిల్లా కోశాధికారి బి.లక్ష్మీదేవి, ఎఐటియుసి డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ కె.సి.బాదుల్లా పాల్గొన్నారు.

➡️