రేపు నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ

Feb 8,2024 00:24

వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌ను సంబంధిత శాఖాధికారులతో కలిసి కలెక్టరేట్‌లో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని విద్యాసంస్థలకు మందులు పంపిణీ చేయాలని, మండల ప్రత్యేకాధికారుల పర్యవేక్షించాలని చెప్పారు. నులిపురుగుల వలన రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆల్బెండజోల్‌ టాబ్లెట్‌ ద్వారా నులిపురుగులను నివారించొచ్చని అన్నారు. ప్రతి విద్యార్థికి నులి పురుగుల నివారణ టాబ్లెట్‌ అందజేయాలని, 9వ తేదీన మాత్రలు తీసుకొని పిల్లలకు 10, 11 తేదీల్లో విధిగా అందించాలని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రవి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1-19 ఏళ్ల వయసుగల ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నివారణ టాబ్లెట్లను అందజేయాలన్నారు. భోజనం అనంతరం మాత్రమే టాబ్లెట్‌ తీసుకోవాలని సూచించారు. ఒకటి నుండి రెండేళ్ల చిన్నారులకు సగం టాబ్లెట్‌ వేయాలన్నారు. పులి పురుగుల నివారణ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావని, మాత్రలు వేసిన అనంతరం ఎటువంటి అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌బిఎస్‌కె కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ స్వర్ణ రాజరాజేశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️