రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

Dec 7,2023 00:05

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : తుపానుతో నష్టపోయి న రైతులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌బాషా తెలిపారు. తుపాను ప్రభావంతో అధికంగా దెబ్బతిన్న మూడు మండలంలోని ఎనిమిది ప్రాంతాలలో జిల్లా కలెక్టర్‌ బుధవారం విస్తృతంగా పర్యటించారు. కర్లపాలెం మండలం పేరలి, ఎంవి రాజుపాలెం, బుద్దాం, యాజలి గ్రామాలు, చెరుకుపల్లి మండలంలోని కనగాల గ్రామం, భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామాలలో నీట మునిగిన వరి, మిర్చి పంటలను ఆయన పరిశీలించారు. యాజలి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న నిర్వాసితులతో మాట్లాడారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతితో కలిసి కలెక్టర్‌ రెండు గ్రామాలలో పర్యటించారు. మీడియాతో మాట్లాడారు. బాపట్ల మండలం పేరలి గ్రామం వద్ద మంగళవారం రాత్రి 8 గంటలకు తుపాను తీరం దాటిందని తెలిపారు. జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సహాయం అందిస్తుందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో జి రవీందర్‌ జిల్లా వ్యవసాయశాఖ అధికారి షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️