రైతులను వెంటనే ఆదుకోవాలి :సిపిఎం

Dec 7,2023 21:13
గూడూరులో సిపిఎం వినతి

రైతులను వెంటనే ఆదుకోవాలి :సిపిఎంప్రజాశక్తి – కెవిబిపురం తుపాను కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు దాసరి జనార్ధన్‌, నాగరాజు డిమాండ్‌ చేశారు. వేరుశనగ, కూరగాయలు, పూలతోటలు, కొబ్బరితోటలకు పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లిందన్నారు. రోడ్లు వంతెనలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కళత్తూరు కలుజు తెగి వరద ఉధృతికి కలత్తూరు, కాట్రపల్లి, మహదేవపురం గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి తుపాను బాధితులందరికీ నష్టపరిహారం అందించాలని డిమాండ్‌చేశారు. గిరిజన కుటుంబాలకు తూతూమంత్రంగా సరుకులు ఇచ్చి సరిపెట్టేస్తారా? అని ప్రశ్నించారు. బిఎన్‌ కండ్రిగ : పంట నీట మునిగిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం నాయకులు నలుగురు రమణయ్య, బాల గురవయ్య, జికె రమణయ్య, పాల్‌ డిమాండ్‌చేశారు. చిన్నాయగుంట, బంగ్లాతోట, జంపుగోళం, తహనగర్‌, పెద్దపాలువేడు, జీవన్‌కండ్రిగ, పూసలపల్లి, కుంభాకం తదితర గ్రామాల్లో పంట నీట మునిగిందని, కరెంట్‌ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.అరిగిన కండ్రిగలో పాత ఇందిరమ్మ కాలనీ ఇళ్లు మొత్తం ఉరుస్తున్నాయని తెలిపారు. విద్యుత్‌ సౌకర్యం పునరుద్ధరించి, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. గూడూరు రూరల్‌: తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన నిరాశ్రయులకు, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు జోగి శివకుమార్‌ డిమాండ్‌చేశారు. డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇళ్లలో వరదనీరు చేరడంతో పప్పుదినుసులు, బియ్యం, పుస్తకాలన్నీ వరద తాకిడికి కొట్టుకుపోయాయన్నారు. తినడానికి తిండిలేక, బట్టల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొలాల్లో ఇసుక మేట వేసి వరి పైరు పనికి రాకుండా పోయిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30వేలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. బివి రమణయ్య, ఎస్‌.సురేష్‌, బి.గోపీనాథ్‌, అడపాల ప్రసాద్‌, నారాయణ, బి.చంద్రయ్య పాల్గొన్నారు. సబ్‌కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ నిరసన గూడూరు టౌన్‌ : మిచౌంగ్‌ తుపానుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. గురువారం గూడూరు పట్టణంలోనీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యలో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గూడూరు డివిజన్‌ పరిధిలో నిమ్మ, సవక, బొప్పాయి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే ఎకరాకు 30 వేలరూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. గూడూరు పట్టణ గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం లేక ఇప్పటికీ అంధకారంలో ఉన్నారన్నారు. తాగు నీటి కొరకు ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రములొ సర్వేపల్లి ఇంఛార్జి చంద్ర శేఖర్‌, చిల్లకూరు మండల అధ్యక్షులు వేమయ్య, గూడూరు మండల అధ్యక్షులు బండి భాస్కర్‌ రెడ్డి, దర్శి నాగభూషణము శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం : టిడిపి పిచ్చాటూరు : తుపాను వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని టిడిపి అధ్యక్షులు నరసింహులు యాదవ్‌ విమర్శించారు. రామగిరి, రామాపురం, పిచ్చాటూరు గ్రామాల్లో పట్టా భూములు నాలుగు అడుగుల మేర కోతకు గురయ్యాయని రైతులు చెబుతున్నా సిఎం పట్టించుకోకపోవడం ఎంతవరకూ సమంజసం అన్నారు. టిడిపి హయాంలో రైతులకు హెక్టార్‌కు 20వేలు నష్టపరిహారం అందించామని, వైసిపి హయాంలో 15వేలే ఇచ్చారన్నారు. ప్రస్తుతం హెక్టార్‌కు 30వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అరణియార్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం వల్ల లక్ష చేప పిల్లలకు గాను పది లక్షల చేప పిల్లలు సముద్రం పాలయ్యాయని అధికారుల చేత చెప్పించడం సమంజసం కాదన్నారు. మాజీ ఎఎంసి ఛైర్మన్‌ డి.ఇలంగోవన్‌రెడ్డి, నారాయణవనం మండల అధ్యక్షులు గిరిబాబు, అరుల్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.గూడూరులో సిపిఎం వినతి

➡️