రైతులపై కాల్పులు అమానుషం

దేవరాపల్లిలో నిరసన తెలుపుతున్న వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకన్న రైతులు, కూలీలు

ప్రజాశక్తి-దేవరాపల్లి

రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరడమే నేరమన్నట్లు హర్యానా ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రక్తసిక్తం చేయడంపై ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన గురువారం దేవరాపల్లిలో రైతులు, కూలీలు నిరసన తెలిపారు. రైతులపై బిజెపి ప్రభుత్వం కాల్పులు జరపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వెంకన్న మాట్లాడుతూ రైతులను దేశానికి శత్రువుల్లా చూస్తూ వారిని అడ్డుకోవడానికి అడుగుడుగునా సిమెంటు బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు బిజెపి ప్రభుత్వం పెట్టిందని తెలిపారు. అయినా వెనక్కి తగ్గకుండా చావో రేవో తేల్చుకుంటామని, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు పోరాటం సాగిస్తామంటూ రైతులు బారికేడ్లను, కంచెలను తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా, హర్యానా పోలీసులు రబ్బర్‌ బులెట్లు, టియర్‌ గ్యాస్‌ ఫిరంగులతో తీవ్ర స్థాయిలో రైతులపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనలో పంజాబ్‌ రాష్ట్రం, భటిండా జిల్లా బాలాక్‌ గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువ రైతు శుభ కరణ్‌ సింగ్‌ చనిపోయారని, 25 మంది రైతులకు గాయాలయ్యాయని తెలిపారు. హర్యానా ప్రభుత్వ దాష్టీకానికి ఇంతకు ముందు ఇద్దరు రైతులు బలయ్యారన్నారు. రైతుల పట్ల మోడీ ప్రభుత్వ దుర్మా ర్గానికి ఇదొక నిదర్శనమన్నారు.నక్కపల్లి : ఢిల్లీలో రైతులపై పోలీసులు జరిపిన కాల్పులు హేయమైన చర్య అని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన స్థానిక రైతులతో కలిసి మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలు, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో పోలీసులతో రైతులపై దాడి చేయించడం దుర్మార్గమన్నారు. రైతుల ఉద్యమం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో దోనివాని లక్ష్మీపురం మాజీ ఎమ్‌పిటీసి గింజాల వెంకటరమణ, గరికిన చిట్టిబాబు, కిల్లాడ సింహాచలం, కిల్లాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️