రైతుల్లో అలజడి

ప్రజాశక్తి – సాలూరు : మిచౌంగ్‌ తుపాను కారణంగా పట్టణం, మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు ఊపందుకున్నాయి. మంగళవారం రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 1.7 మిల్లీ మీటర్లు కాగా ఇంతవరకు 14.1 మిల్లీ మీటర్లు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మంగళవారం పట్టణం, మండలంలోని శివరాంపురంలో పర్యటించారు. పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్‌, వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు అధికారులతో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌ మంగళవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని ఫిలడెల్ఫియా ఆసుపత్రి ముందున్న చెరుకుపల్లిగెడ్డ కాలువను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలు పడినప్పుడు చెరుకుపల్లి గెడ్డ కాలువ ద్వారా వరద నీరు ఎక్కువగా ప్రవహించి రోడ్డు పైకి వస్తుందని, తద్వారా రామాకాలనీ ముంపునకు గురవుతుందని అధికారులు తెలిపారు. దీంతో కాలువలో పూడిక తీసి వరద నీరు రోడ్డు పైకి రాకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ తర్వాత శివరాంపురం గ్రామాన్ని సందర్శించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన వేగావతి నదిపై వంతెన నిర్మాణాన్ని పరిశీలించి సూచనలు చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలెవరినీ నదిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్‌ జర్జాపు మోహన్‌ రావుకు సూచించారు.నేలకొరిగిన వరి పొలాలుమండలంలోని పెదపధం, శివరాంపురం, కూర్మరాజుపేట గ్రామాల్లో వరి కోతలు, నూర్పులు చాలా వరకు జరిగాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా తరలింపు జరిగింది. అయితే కోతలు కోయని గ్రామాల్లో వరి పొలాలు కొంత వరకు నేలకొరినట్లు తెలుస్తోంది. దత్తివలస, జీగిరాం, నెలిపర్తి, కూర్మరాజుపేట గ్రామాల్లో అక్కడక్కడా వరి చేలు వర్షాలకు నేలకొరిగాయి. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం వరి పొలాలు ఎక్కడా నేలకొరిగిన దాఖలాల్లేవని చెబుతున్నారు. మండలంలో ఇంతవరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా 314 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలించినట్లు చెప్పారు. శివరాంపురం, పెదపదం, కూర్మరాజుపేట గ్రామాల్లో చాలా వరకు ధాన్యం కొనుగోలు పూర్తయిందని తెలిపారు.ముందు జాగ్రత్త చర్యలు: కమిషనర్‌ జయరాంమిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కమిషనర్‌ టి.జయరాం చెప్పారు. ఫిలిడెల్పియా ఆసుపత్రి ముందున్న కాలువలో పూడిక తీత పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచామని చెప్పారు. అవసరమైతే డబ్బివీధి మున్సిపల్‌ హైస్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు కు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణంలోని అన్ని సచివాలయాల్లో సిబ్బందికి తుపాను విధులు నిర్వహణకు సిద్ధం చేశామని కమిషనర్‌ జయరాం తెలిపారు. అనంతరం మంగళవారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలో వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ, అమెనిటీస్‌ సెక్రటరీ, శానిటేషన్‌ సెక్రటరీ లతో కమిషనర్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా వార్డుల్లో ఎలాంటి విపత్తులెదురైనా వెంటనే సమాచారం అందజేయాలని సూచించారు. ఆరో తేదీ వరకు సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ డిఇ శ్రీరామ్మూర్తి,ఎఇ సూరి నాయుడు, శానిటేషన్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఫకీర్‌ రాజు పాల్గొన్నారు.పాచిపెంట : తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ కోరారు. మండలంలోని అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు అనంతరం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు పంటలు, ఇతర నష్టాలు కలగలేదని, అయినా క్షేత్రస్థాయిలో అధికారులను పరిశీలించాలని ఆదేశించామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విస్తరంగా కురుస్తున్న వర్షం కారణంగా పెద్ద గడ్డ జలాశయంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని, దీంతో ముందస్తు జాగ్రత్తగా కేసలి, కోటికి పెంట, మడవలస ముంపు గ్రామాలైన నిర్వాసితులు ఇబ్బందులకు గురికాకుండా పాచిపెంట, కోడికాళ్లవలస, గరేళ్లవలసలో 4000 మందికి సరిపడా నాలుగు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. అలాగే మత్స్యకారులు జలాశయంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామన్నారు. మండలంలో గుర్తించిన 74 చెరువుల వద్ద ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొనేందుకు వీలుగా వాలంటీర్లను నియమించినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు అమ్మవలస వద్ద ఉన్న కాజ్‌వేపై నుండి కొండవాగు ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు తహశీల్దార్‌ ఎం.రాజశేఖర్‌, ఎంపిడిఒ పి.లక్ష్మీకాంత్‌, ఎఒ కె.తిరుపతిరావు. ఎస్సై ఎస్‌కె ఫక్రుద్దీన్‌, సిడిపిఒ బి.అనంతలక్ష్మి తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : కురుపాం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తుపాను ప్రభావం కనిపించింది. దీనివల్ల ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షాల్లేక పూర్తిగా కరువు కోరల్లో ఉన్న రైతులు కాస్త మిగిలి ఉన్న పంటనైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పడరానికి పాట్లు పడుతున్నారు. వరి, పత్తి పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.తుపాను భయం.. పాలకొండ : తుపాను హెచ్చరికలు తీవ్రంగా ఉండడంతో రైతుల్లో భయం వెంటాడుతుంది. పాలకొండలో పెద్దగా ప్రభావంగా లేకపోయినప్పటికీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. మండలంలో 17 వేల ఎకరాలు వరకు వరి సాగు జరుగుతుంది. అయితే తుపాన్‌ హెచ్చరికలతో పొలంలో ఉన్న పంటలను జాగ్రత్త చేస్తున్నారు. కొన్ని చోట్ల వరిని కల్లాలకు తీసుకురావడం, అవకాశం లేనిచోట్ల పొలంలోనే కుప్పలుగా పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మండలంలో భాసూరు, విపి రాజుపేట, అంపిలి, అన్నవరం తదితర గ్రామాల్లో ఈ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. మిచాంగ్‌తో రైతుల్లో అలజడికురుపాం : మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావం రైతుల్లో తీవ్ర అలజడి రేపింది. ఆరుగాలం శ్రమించడంతో పక్వానికి వచ్చిన వరి పంట నీటి పాలవుతోందన్న భయంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది గత మూడు నెలలుగా సకాలంలో వర్షాలు కురవకపోయినా సరే వరి పంటలను రైతులు కష్టపడి నిలబెట్టారు. కోత దశలో ఉన్న వరి పంటను రేపో మాపో సమాకుర్చుకోవాల్సిన దశలో తీవ్ర తుపాన్‌ రావడంతో కొంత మంది రైతులు ఆందోళనలో చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా తుపాను ఏర్పడడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. మండలం కొన్ని చోట్ల వరి పంట పక్వానికి రాగా మరి కొన్ని చోట్ల కోసిన పంట వర్షానికి తడిసి ముద్దవుతోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వచ్చినా అధిక పెట్టుబడులతో నిలబెట్టినా పంట చేతికి అందే సమయంలో ఇలా తుపాను రావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.వీరఘట్టం : మండలంలోని ప్రజలను అప్రమత్తం చేయాలని తహశీల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ విఆర్‌ఒలను ఆదేశించారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఆర్‌ఒల సమావేశంలో మాట్లాడారు. తుపాను దృష్టిలో పెట్టుకొని సంబంధిత గ్రామాలు సందర్శించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో విఆర్వోలు పాల్గొన్నారు.తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పిఒమక్కువ : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారి, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి విష్ణు చరణ్‌ పర్యటించారు. వాతావరణశాఖ హెచ్చరికల మేరకు వివిధ శాఖలు చేపట్టాల్సిన పనులను స్పష్టంగా తెలిపారు. కళ్లాల్లో ధాన్యం ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ధాన్యం ఉంటే వ్యవసాయ సహాయకునికి సమాచారం అందించాలని కోరారు. వరద అవకాశం ఉన్న చెరువులు, వాగులు, వంకల వద్ద, ప్రమాదకర క్రాసింగ్‌ల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి ఎవరూ దాటకుండా చూడాలని ఆయన చెప్పారు. రవాణాకు, తాగునీటికి, విద్యుత్‌ కు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయుటకు ఎటువంటి సమస్య ఏర్పడకుండా పక్కా కార్యాచరణ ప్రణాళికలు, పరికరాలు ఉండాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం సన్నాహక చర్యలు పరిశీలించారు. మండలంలో పర్యటించి అక్కడి పరిస్థితులు అంచనా వేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌, ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు.జిల్లాలో మోస్తరుగా వర్షాలుపార్వతీపురంరూరల్‌ : తుపాను ప్రభావం వల్ల జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దట్టంగా మబ్బులు కమ్ముకొని నెలకొనగా, సన్నటిపాటి చినుకులు అప్పుడప్పుడు కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. బీకరమైన గాలులు వేస్తాయని ప్రకటించినప్పటికీ ఈదురు గాలులు అంతగా లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల వరకు అధికారులు తెలిపిన వర్షపాత వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో అధికంగా మక్కువ మండలంలో 14.0 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా గరుగుబిల్లి మండలంలో 1.8 మిల్లీమీటీర్ల వాన పడింది. కొమరాడ 5.4, పార్వతీపురం 6.2, సీతానగరం 9.4, బలిజిపేట 6.4, సాలూరు 6.4, పాచిపెంట 7.8, కురుపాం 8.7, జియ్యమ్మవలస 6.2, గుమ్మలక్ష్మిపురం 2.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.నేడు పాఠశాలలకు సెలవుపార్వతీపురంరూరల్‌ : జిల్లాలో పాఠశాలలకు బుధవారం కూడా సెలవును ప్రకటించారు. ఈ మేరకు మంగళ వారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా పిల్లల సురక్షిత చర్యల్లో భాగంగా సెలవు ప్రకటించేందుకు కలెక్టర్‌ అనుమతించారని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, వంట ఏజెన్సీలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. కంపెన్సేటరి సెలవుగా ప్రకటించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

➡️