రైతు, కార్మికసంఘాలు ధర్నా

Feb 26,2024 21:03

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : దేశంలో కార్మిక, కర్షకుల ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)తో ప్రభుత్వాలు చేసుకుంటున్న ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా చైర్మన్‌ బంటు దాసు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పాత బస్టాండ్‌ నుంచి కలెక్టర్‌ ఆఫీస్‌ వరకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు పోరాటంలో మరణించిన శుభ్‌కరణ్‌సింగ్‌కు నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత చేయాలని, అన్ని పంటలకు కాలపరిమిత లేకుండా ఎంఎస్‌పి ఇవ్వాలని కోరారు. విద్యుత్‌ సంస్కరణను ఉపసంహరించుకోవాలని, 26 లేబర్‌ కోడ్లను ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులను పెంచాలని కౌలు రైతులకు కౌవులకు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వ నుండి పంట నష్ట పరిహారాలు ప్రభుత్వ బీమా పథకాలు మొదలగువి వర్తింపచేయాలని పై డిమాండ్లతో పాటు కర్షక, కార్మిక, వ్యవసాయ కార్మికులకు అవసరమైన చట్టాలను చేయమని ఐక్య కార్యాచరణ సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా పెడచెవిన పెట్టి డబ్ల్యూటిఒ ఒప్పందం ప్రకారం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సంయుక్త కిసాన్‌ మోర్చా సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ బంటు దాసు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వర్మ, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిరా, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి రమణమూర్తి, నాయుడు, భాషా, గిరిజన సంఘం నాయకులు రంజిత్‌ కుమార్‌, జి.సారయ్య, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి పాల్గొన్నారు.బలిజిపేట : ఢిల్లీలో రైతు ఉద్యమకారుడు శుబ్‌కరణ్‌ సింగ్‌పై నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడిన కర్కాశ ఉన్మాద దాడిని రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని రైతు సంఘం మండల కార్యదర్శి బలగ సత్యనారాయణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు అన్నారు. ఎస్‌.కె.ఎం, కార్మిక సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బలిజిపేటలో సోమవారం నిరసన రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేపడుతున్న పోరాటం పట్ల బిజెపి మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుందని, గత పోరాటంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న రైతుల పట్ల ఇటువంటి తీవ్రమైన దాడులకు పాల్పడడం అమానుషమని మండిపడ్డారు. రైతు ఉద్యమకారుడు శుబ్‌ కరణ్‌ సింగ్‌ను మోడీ ప్రభుత్వం హత్య చేసే చర్యను ఖండిస్తున్నామని, రైతులపై కాల్పులకు కారకులైన పోలీసులను తీవ్రంగా శిక్షించాలని, చనిపోయిన రైతు కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సోమనాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలని పార్లమెంట్లో మద్దతు ధరల చట్టం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వెన్నెల వేణు, రైతు సంఘం మండల నాయకులు బి.భానుమూర్తి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆవు సాంబమూర్తి, ఆటో యూనియన్‌ నాయకులు రామారావు, ప్రజా సంఘాల నాయకులు దుర్గారావు, రైతు కూలి సంఘం నాయకులు మామిడి సింహాద్రి నాయుడు, రైస్‌ మిల్లు కార్మికులు పాల్గొన్నారు.పాచిపెంట : సంయుక్త కిసాన్‌ మోర్చా రైతు సంఘం మండల అధ్యక్షులు మాదిరెడ్డి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో మండలంలోని కొత్తవలస, మిర్తివలస ప్రాంతాల్లో ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వం వల్ల రైతులు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల కతీతంగా రాష్ట్రం, రైతాంగ అభివృద్ధికి ప్రజలంతా మోడీ విధానాలను ఎండగట్టాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. పోలీసు కాల్పుల్లో యువరైతు శరణ్‌సింగ్‌ మరణం చాలా బాధాకరమన్నారు. అసువులు బాసిన రైతాంగం స్ఫూర్తితో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో భవిష్యత్‌ పోరాటాలకు ప్రజలంతా సిద్ధం కావాల న్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు బొంగు కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.గణేష్‌, రమేష్‌, ఆదినారాయణ, సిఐటియు నాయకులు కె.ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️