రైల్వేట్రాక్‌ పునరుద్దరణ

Mar 11,2024 21:14

 ప్రజాశక్తి-కొత్తవలస : కొత్తవలసలో ఆదివారం రాత్రి విశాఖపట్నం – భవానిపట్నం పాసింజర్‌ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన రైలేట్రాక్‌ పునరుద్దరణ పనులు సోమవారం మధ్యాహ్నానికి పూర్తి చేసి బోగీలను పట్టాలెక్కించారు. సంఘటనా స్థలాన్ని విశాఖపట్నం రైల్వే డిఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌ పరిశీలించారు. సంఘటనకు దారి తీసిన కారణాలపై నిపుణులతో చర్చించారు. రైల్వే సిబ్బంది సుమారు 14గంటల పాటు శ్రమించి పట్టాలు తప్పిన ఇంజన్‌ను, బోగీలను ట్రాక్‌లపైకి ఎక్కించారు. ఈ పనులను డిఆర్‌ఎం సోమవారం తెల్లవారు జామునుంచి దగ్గరుండి పర్యవేక్షించారు. హై టెన్షన్‌ విద్యుత్‌ తీగలు పైన ఉండటంతో మాన్యువల్‌ పద్ధతిలో హైడ్రాలిక్‌ జాకీలను వినియోగించి సుమారు 14 గంటల పాటు రైల్వే శాఖ వివిధ విభాగాల వారు శ్రమించి ట్రాక్‌ పునరుద్ధరణకు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నంకి లైన్‌ క్లియర్‌ చేసి రైళ్లను ఆ లైన్‌లో యథావిధిగా నడిపారు. ప్రమాదానికి కారణాలపైరైల్వే ఉన్నతాధికారులు ఆరా తీశారు.

➡️