రోడ్లు నిర్మించాలని గిరిజనుల ధర్నా

Jan 9,2024 21:52

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ మండలంలోని చాపరాయిగూడ, బాపనగూడ, దీసరిగూడ, చినతోలుమండ, అర్నాడ, అర్ణాడవలస, దంగభద్రవలస, పసుపువానివలస, చిలకలవలస, పొట్టిదొరవలస, చంద్రశేఖర్‌రాజ పురం, గంగరాజుపురం, గదబవలస గ్రామాలకు నేటికీ రోడ్డు మార్గం లేదన్నారు. దీంతో గిరిజనులు బయట ప్రాంతాలకు రావాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీలు, గిరిజనులకు అనారోగ్యం వాటిల్లితే డోలీలు కట్టి అతి కష్టమ్మీదకిందికి వైద్యం కోసం తీసుకు వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. అత్యవసర సమయంలో వైద్యమందక కొంత మంది మార్గమధ్యనే చనిపోతున్న ఘటనలు బాధాకరమన్నారు. అటవీ ఉత్పత్తులు, చింతపండు, జీడి పిక్కలు, ధాన్యం, కందులు, మినుములు అమ్ముకోవడానికి, రేషన్‌ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి తలపైన మోసుకొని అతి కష్టమ్మీద కొండలు ఎక్కి దిగుతున్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా గిరిజన గ్రామాలకు రోడ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జియ్యమ్మవలస ఎంపిపి బొంగు సురేష్‌ మాట్లాడుతూ మండలంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉన్నపటికీ ఆమె ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలకు రోడ్లు మంజూరు చేయడం, అనుకూలంగా లేని గ్రామాలకు రోడ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. సొంత మండలంలోనే గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపోవడం సిగ్గుచేటన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేసేవరకు గిరిజనుల తరుపున పోరాటం చేస్తానని అన్నారు. అనంతరం ఎంపిడిఒకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి గొరపాడు సోమయ్య, గిరిజన సంఘం జిల్లా నాయకులు కె.సీతారాం, వ్యవసాయ కార్మిక మండల కార్యదర్శి బి మోహన్‌రావు, గిరిజనులు పాల్గొన్నారు.

➡️