లీజు భూముల్లో చెట్లు నరికివేత

Dec 18,2023 23:24
దేవస్థానం భూముల్లో

ప్రజాశక్తి- కడియం
లీజుకు తీసుకున్న దేవస్థానం భూముల్లో చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో గల దేవాదాయ భూములకు ఇటీవల కాలంలో శిస్తుల రూపేణా అధిక మొత్తంలో ఆదాయం సమకూరింది. కడియం శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయానికి కడియపులంక గ్రామ శివారు దోసాలమ్మ కాలనీ సమీపంలో సుమారు 17 ఎకరాలు భూములున్నాయి. సర్వే నెంబర్‌ 353/ 2ఎలో సుమారు 5.5 ఎకరాలు భూమికి గత నెలలో వేలం జరిగింది. గ్రామానికి చెందిన ఒక ప్రముఖ నర్సరీ రైతు రూ.12.50 లక్షలకు వేలాన్ని దక్కించుకున్నారు. ఇదే భూమికి ఇప్పటివరకూ ఇదే గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు రూ.1.25 లక్షలు చెల్లించి ఏడాది పాటు లీజుకు తీసుకున్నాడు. కొత్త పాటదారుడు భూమి చదును పేరిట స్థలంలో కొబ్బరి, తాడి చెట్లను తొలగిస్తున్నారు.అంతేకాకుండా గ్రావెల్‌ రోడ్లు వేస్తున్నారు. దీనిపై కాలనీవాసులు అధికారులకు తెలిపినా ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఒకరైతు వేమగిరి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి చెందిన వేమగిరి గ్రామంలో గల సర్వే నెంబర్‌ 275లో గల 5.71 ఎకరాలు భూమిని సుమారు రూ.8 లక్షలకు లీజు దక్కించుకున్నారు. ఈ భూమిలో వివిధ చెట్లు తొలగించడంతో పాటూ సమీపాన గల ఆర్‌ అండ్‌ బి రహదారి మార్జిన్‌లోని దశాబ్దాల నాటి వక్షాలను తొలగించి అమ్మేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వృక్షాల తొలగింపు సమయంలో రోడ్డు మార్జిన్‌ తవ్వేయడంతో విద్యుత్‌ స్తంబాలు ఒరిగి ప్రమాదకరంగా దర్శనం ఇస్తున్నాయి. ఈ విధానం ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో దేవాలయ భూములు మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటాయని, భూములను రక్షించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై కడియం దేవస్థానం ఇఒ వివి.శ్రీనివాసరావు ను వివరణ కోరగా సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. భూములు పరిశీలించామని, భూమిలో వాస్తవ పరిస్థితులు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

➡️