వచ్చే ఎన్నికల్లో టిడిపిదే విజయం: కందుల

ప్రజాశక్తి-మార్కాపురం: వైసిపి పాలనలో విసుగు చెందిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతున్నారని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన టిడిపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని అన్నారు. పార్టీ అధినేత, మాజీ సిఎం చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో ఎలాగూ టిడిపి అధికారంలోకి రాబోతోందని, మార్కాపురంలోనూ మనం గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కష్టపడ్డ వారిని గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. మార్కాపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవదనే భయంతో ప్రత్యర్థులు తనకు జరిగిన ప్రమాదాన్ని కూడా వక్రీకరిస్తున్నారన్నారు. చంద్రబాబు కలిసేందుకు చేతికర్ర లేకుండా నాలుగు అడుగులు వేశానని అన్నారు. టిడిపి కార్యక్రమాల్లో కుర్చీలో కూర్చుంటారని, అక్కడ నడుస్తున్నారని కామెంట్లు చేయడం బాధగా ఉందన్నారు. తాను ప్రమాదంలో చచ్చి బ్రతికానన్నారు. అంతటి ప్రమాదంలో తన కాళ్లు, శరీరంలోని ఇతర భాగాల్లోని ఎముకలు విరిగాయన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపారు. దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడటం సిగ్గు చేటన్నారు. టిడిపి పోల్‌ స్ట్రాటజిస్ట్‌ అశోక్‌ మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఏ రకంగా కష్టపడాలో వివరించారు. మీ పరిధిలోని ఓటర్లను ఏ రకంగా టిడిపి వైపు తిప్పుకోవాలో అవగాహన కల్పించారు. అనంతరం మార్కాపురం పట్టణంలోని 11వ వార్డుకు చెందిన 64 మంది యువకులు నాయుడు ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరినీ పార్టీ కండువాలతో కందుల సాదరంగా ఆహ్వానించారు. సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షులు షేక్‌ మౌలాలి, ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, తర్లుపాడు మండల టిడిపి అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు, టిఎన్‌టియుసి ఆర్గనైజింగ్‌ రాష్ట్ర కార్యదర్శి డి మస్తానయ్య, మట్టం వెంకటేశ్వర్లు, పఠాన్‌ ఇబ్రహీం ఖాన్‌ పాల్గొన్నారు.

➡️