వరికెపూడిశెల పనులెప్పుడు?

Jan 20,2024 00:56

గతేడాది నవంబర్‌ 15న వరికపూడిశెలకు శంకుస్థాపన చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి తదితరులు
ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : వరికెపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి రెండు నెలలు దాటిన ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మెగా ఇంజినీరింగ్‌ కంపెనీకి టెండర్లు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 40 రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తుందని ప్రచారం జరుగుతుండగా ఇంతవరకు పనులు ప్రారంభం కాకపోవడం తో ఈ పనులు ఇప్పట్లో జరగవనే వాదన ఉంది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వైల్డ్‌ లైఫ్‌ అనుమతులు మంజూరు చేసి దాదాపు ఆరు నెలలు అవుతున్నా పనులు ప్రారంభానికి నిధుల కేటాయించలేదని తెలిసింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి కోసం చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూసింది. మొత్తం 47.82 ఎకరాల అటవీ భూమి తరలింపునకు అనుమతులు మంజూరు చేశారు. పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం అయిన వైల్డ్‌లైఫ్‌ (వన్య ప్రాణుల) అనుమతులకు క్లియరెన్స్‌లను కేంద్రం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. క్లియరెన్స్‌లు పొందటానికి రాష్ట్రం ప్రభుత్వం నుండి పంపిన నివేదికలను కేంద్రం పరిశీలించి, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ క్లియరెన్స్‌ నుండి అనుమతులు వచ్చినా ఇంతవరకు మొదటి దశ పనులు ప్రారంభం కాలేదు. సీఎం జగన్‌ గత నవంబర్‌ 15 న మాచర్లలో శంకుస్థాపన చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్‌, చంద్రబాబు నాయుడు వేర్వేరుగా రెండు సార్లు శంకుస్థాపన చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో 2019లో ఎన్నికల ముందు నారా లోకేష్‌ కూడా మరో సారి శంఖుస్థాపన చేశారు. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్‌కు అందరూ శంఖుస్థాపన చేశారని మేము పనులు పూర్తి చెందుకి శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం జగన్‌ గత నవంబర్‌ 15 న మాచర్ల సభలో ప్రకటించారు. కానీ 60 రోజులు దాటినా ఇంత వరకూ పనుల గురించి పట్టించుకునే వారే లేరు. అధికారులు కూడా ఇంత వరకు ఒక్కసారి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించలేదు.

➡️