వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన

ప్రజాశక్తి-త్రిపురాంతకం : తుపాను కారణంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మండల పరిధిలోని గొల్లపల్లిలో తుపాను కారణంగా నేలకొరిగిన వరి పంటను వ్యవసాయాధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో తుపాను ప్రభావం వల్ల 5,478 ఎకరాల్లో వరి, 798 ఎకరాల్లో సజ్జ, 311 ఎకరాల్లో కంది, 3,399 ఎకరాల్లో మినుము, 20,499 ఎకరాల్లో పొగాకు, 128 ఎకరాల్లో నువ్వులు, 7,761 ఎకరాల్లో శనగ, 30 ఎకరాల్లో పెసర, 72 ఎకరాల్లో ఉలవలు, 67 ఎకరాల్లో జొన్న కలిపి మొత్తం 38,483 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు ప్రాథిమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సర్పంచి ఓబుల్‌రెడ్డి తిరుమల్లయ్య, వైసిపి మండల కన్వీనర్‌ సింగారెడ్డి పోలిరెడ్డి,తహశీల్దారు కిరణ్‌, ఎఒ నీరజ, బీసీ నాయకుడు పిచ్చయ్య, రైతులు పాల్గొన్నారు. కనిగిరి : తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. మండల పరిధిలోని మండాదివారి పల్లి, తక్కెలపాడు గ్రామాలలో తుపాను ప్రభావం కారణంగా దెబ్బతిన్న పంటలను బుధవారం పరిశీలించారు. వరి, మిరప, మినుము పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసి నివేదికలు ఉన్నత అధికారులకు అందజేసి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి, నాగిరెడ్డి, పిచ్చాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొదిలి : మిచౌంగ్‌ తుపాను కారణంగా నీటి మునిగిన పొగాకు తోటలను పొగాకు బోర్డు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. మండల పరిధిలోని అన్నవరం, చింతగంపల్లి, అగ్రహారం, కెల్లంపల్లి, గుండ్లసముద్రం, కాటూరిపాలెం గ్రామాలలో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు వేలం నిర్వహణ అధికారి జి. గిరిరాజ్‌ కుమార్‌, ఎఒ జైనులాబ్దిన్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ కె.దుర్గా ప్రసాద్‌ , ఎస్‌కె. బాషా, సిబ్బంది పాల్గొన్నారు. మద్దిపాడు : మిచౌంగ్‌ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజే యాలని తెలుగు రైతు మండల అధ్యక్షులు రావి ఉమా మహేశ్వరరావు కోరారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పొగాకు పంటను పొగాకు బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌ కుమార్‌, వెల్లంపల్లి బోర్డు వేలం నిర్వహణ అధికారి సత్య శ్రీనివాస్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మెంబర్‌ పొద వరప్రసాద్‌, చలమయ్య, దామోదర్‌, రైతులు వెంకయ్య చౌదరి, సుధాకర్‌, సురేంద్ర, రాంబాబు, నారాయణ, ఆంజనేయులు పాల్గొన్నారు. చీమకుర్తి : తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలను దెబ్బతిన్న పంటలను రైతుసంఘం, సిపిఎం నాయకులు బుధవారం పరిశీలించారు. మండల పరిధిలోని కెవిపాలెం, ఏలూరివారిపాలెం,గోనుగుంట తదితర గ్రామాలలో పొగాకు పంట దెబ్బతింది. చినరావిపాడు, బూసరపల్లి గ్రామాల్లో మిరప పంట, మినుము పంట దెబ్బతింది. పాటిమీదపాలెంలో వరి పంట నేలమట్టమైంది. పాటిమీదపాలెంలో దెబ్బతిన్న రైతు సంఘం మండల కార్యదర్శి క్రిష్టిపాటి చిన్నపురెడ్డి, సంఘం నాయకులు కుమ్మిత శ్రీను, క్రిష్టిపాటిశ్రీనివాసులరెడ్డి,కెశ్రీనులు వరి పంటను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు, రైతుసంఘం నాయకులు జిల్లా నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు బెజవాడ శ్రీను, నాయకులు పంగులూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పెద్దదోర్నాల : తుపాను కారణంగా మండల పరిధిలోని బొమ్మలాపురం గ్రామంలో నేలకొరిగిన అరటి, పొగాకు తోటలు నేలకొరిగాయి. కోసి ఎండబెట్టిన పొగాకు తడిసి పోయింది. గాలి శ్రీనివాసరెడ్డి మూడు ఎకరాల్లో సాగు చేసిన అరటి తోట నేలమట్టమైంది. రమణారెడ్డి, కిక్కూరి నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, తిరుపతిరెడ్డిలు సాగు చేసిన అరటి తోటలు కూడా నేలమట్టమయ్యాయి. ఎఒ జవహర్‌లాల్‌ నాయక్‌ బొమ్మలాపురం గ్రామంలో దెబ్బతిన్న తోటలను పరిశీలించారు. నష్టం అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన చెప్పారు. కొండపి : తుపాను కారణం దెబ్బతిన్న పొగాకు పంటను బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌ కుమార్‌ పరిశీలించారు. మండల పరిధిలోని ముప్పవరం, మిట్టపాలెం, గోగినేని వారి పాలెం గ్రామాల్లో పర్యటించి పొగాకు పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు బొడ్డపాటి బ్రహ్మయ్య, సీనియర్‌ గ్రేడింగ్‌ అధికారి టి.సాయికుమార్‌, క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

➡️