వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించాలి

Mar 27,2024 22:55

మాట్లాడుతున్న రామారావు
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ :
మతోన్మాద బిజెపిని, దాని అంటకాగుతున్న టిడిపి, జనసేన, వైసిపిలను ఈ ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. మండలంలోని నిడమర్రులో సిపిఎం విస్తృత సమావేశం నాయకులు కె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యవసరాలు ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచారని అన్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు బిజెపిని సమర్థించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయం చేసిన బిజెపిని భుజాన వేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసిన బిజెపి మాట తప్పిందని, రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, విశాఖ రైల్వే జోన్‌కు, కడప ఉక్కు పరిశ్రమకు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. అటువంటి బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. వీరిని ఎన్నికల్లో ఓడించి వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను గెలిపించాలని పిలుపుని చ్చారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివశంకర్‌ మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో పేదల సమస్య లపై సిపిఎం అలుపెరగని పోరాటాలు చేసిందని, వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు కోసం పోరాడిందని గుర్తు చేశారు. పోరాడే అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై సిపిఎం నిరంతర పోరాటాలు చేస్తోందన్నారు. ఇళ్ల స్థలాలు ఎల్లపట్టాల సమస్యలపై పోరాటాలు చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వామపక్ష శక్తులను గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు ఎం.భాగ్యరాజు, జి.నాగేశ్వరరావు, కె.ప్రకాష్‌రావు, కె.వీరయ్య కె.నాగేశ్వరరావు, ఎం.రాజముని, కె.బుల్లెబ్బాయి, కె.నానయ్య పాల్గొన్నారు.

➡️