వారసత్వ రక్షణే ధ్యేయం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తమ సంస్థలు ఉమ్మడిగా సేవా సంస్కతి వారసత్వ సంపదలను రక్షించడమే ద్యేయంగా ముందుకు సాగుతున్నాయని, అందులో భాగంగా జిల్లాకు నంది అవార్డులు సాధించి పెట్టిన కళాకారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని పలువురు కళాభిమానులైన వక్తలు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి నంది నాటక పోటీల్లో జిల్లాకు చెందిన వైవీయూ పాలక మండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి, సీనియర్‌ నాటక దర్శకులు పల్లేటి లక్ష్మీకులశేఖర్‌ను సోమవారం ఘనంగా సత్కరించారు. ఇంటాక్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య, రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో ఉమ్మడిగా స్థానిక మానస ఇన్‌ సమావేశ మందిరంలో అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇంటాక్‌ జిల్లా కన్వీనర్‌ లయన్‌ మానస కె. చిన్నపరెడ్డి మాట్లాడుతూ పర్యాటకపరంగా గండికోటలో అంతర్జాతీయ ఒబెరారు హోటల్‌ ఏర్పాటుకు రంగం సిద్దం కావడం, ఇంటాక్‌ కార్యక్రమంలో భాగంగా పాతకలెక్టరేట్‌కు మరమ్మతులు, లయన్స్‌ క్లబ్‌ పరంగా వంద దాటిన సేవా కార్యక్రమాలు తమకు గర్వకారణంగా నిలుస్తున్నాయన్నారు. ఇటీవల వారసత్వ కళల రక్షణ కోసం సీనియర్‌ నాటక సంస్థ సవేరా నిర్వహణ బాధ్యతను కూడా తీసుకున్నామని, ప్రారంభ దశలోనే తమ సభ్యులకు రెండు నంది అవార్డులు రావడం జిల్లాకే గర్వకారణమన్నారు. జిల్లాతోపాటు తమ సంస్థలు నూతన సంవత్సరంలో అభివద్ది పథంలో నడుస్తాయని, మరింత పేరు తెచ్చుకునేందుకు కషి చేస్తామన్నారు. అవార్డు గ్రహీతల్లో ఒకరైన మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ నంది అవార్డు కంటే వైఎస్సార్‌ పేరిట జిల్లా రచయిత సంఘాన్ని ఏర్పాటు చేసి మూడు నెలల్లోనే మహాసభలను విజయవంతంగా నిర్వహించడం మరువలేని జ్ఞాపకంగా నిలుస్తుందన్నారు. పల్లేటి లక్ష్మీకులశేఖర్‌ మాట్లాడుతూ నాటక రంగం తనకు తల్లిలాంటిదని, తన ఉన్నతికి కారణమైన సవేరా సంస్థను మరిచి పోలేమని, చిన్నపరెడ్డి పర్యవేక్షణలో వంద నందులు సాధించగలమన్న విశ్వాసం ఉందన్నారు. డాక్టర్‌ పుత్తా బాలిరెడ్డి మాట్లాడుతూ సవేరా లాంటి సంస్థ నిర్వహణ బాధ్యత తీసుకోవడం జిల్లా నాటక రంగానికి ఆయువు పోసినట్ల్కెందన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఇంటాక్‌ పూర్వ కన్వీనర్‌ ఎలియాస్‌రెడ్డి, డాక్టర్‌ తవ్వా వెంకటయ్య, రెడ్డిశేఖర్‌రెడ్డి, కొండూరు జనార్దన రాజు కార్యదర్శి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలతోపాటు రెడ్డి శేఖర్‌రెడ్డిని కూడా సత్కరించారు. కార్యక్రమంలో బాలగొండ గంగాధర్‌, గునిశెట్టి శ్రీని వాసులు, పద్మప్రియ చంద్రారెడ్డి, కొండారెడ్డి, రాఘవేంద్రవర్మ, రమణారెడ్డి పాల్గొన్నారు.

➡️