వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు: తాటిపర్తి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వాలంటీర్లపై టిడిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వారు సమాజ సేవకులుగా పని చేస్తున్నారనివైసిపి యర్ర గొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం యర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారని తెలిపారు. ఇది ఓర్చుకోలేని చంద్రబాబు అండ్‌ పవన్‌ బ్యాచ్‌ వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న వాలంటీలను ఆది నుంచి ప్రతిపక్ష నాయకులు తిట్టిపోస్తున్నారని విమర్శించారు. ప్రతి నెల ఒకటో తేదీనే వాలంటీర్లు ప్రతి అవ్వా తాత ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి సంక్షేమ పథకం దళారుల ప్రమేయం లేకుండా అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓటమి భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తూ వారిని బాధపెడుతున్నారని అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న ప్రతిపక్ష నాయకులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఎన్నికల నిబంధన నియమావళి ఉల్లంఘించినట్లు కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు చేదురి విజయభాస్కర్‌, రామావత్‌ వాగ్య నాయక్‌, సర్పంచ్‌ అరుణ బాయి, కన్వీనర్‌ ఓబుల్‌రెడ్డి, మైనార్టీ నాయకులు జబివుల్లా, కన్వీనర్‌ సింగారెడ్డి పోలిరెడ్డి, మోర్తాల సుబ్బారెడ్డి, వైసిపి నాయకులు సింగా ప్రసాద్‌, వైసీపీ మహిళా నాయకురాలు సరళ కుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️