విఐటిలో ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు సమావేశం

Mar 4,2024 00:25

ప్రజాశక్తి – తుళ్లూరు : రెండ్రోజులపాటు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డు 6వ సమావేశం రాజధాని అమరావతిలోని విఐటి విశ్వవిద్యాలయంలో ఆదివారం ప్రారంభమైంది. ‘విశ్వవిద్యాలయాల్లో వైబ్రెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడం’ అంశంపై సమావేశాల్లో చర్చించే ఈ సమావేశాలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌, ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ ఆరవ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 51 మంది వైస్‌ ఛాన్సలర్లు, డైరెక్టర్లు హాజరయ్యారని తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ తన సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 87 శాతం విద్యార్థులు ఉచిత విద్యను పొందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లల్లో సుమారు రూ73 వేల కోట్లను విద్య కోసం ఖర్చు చేసిందని అన్నారు. రాష్ట్రం తన జిడిపిలో 4 శాతం విద్యకు కేటాయించిందని చెప్పారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్‌ టి.జి. సీతారాం చైర్మన్‌ (ఎఐసిటిఈ) మాట్లాడుతూ ఎ ఐసిటిఈ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను గురించి వివరించారు. వివిధ సంస్థలు కలిసి పని చేసినప్పుడే వివిధ విభాగాల్లో విజ్ఞానంలో పురోగతి వేగవంతం అవుతుందని. విభిన్న దృక్కోణాలు, నైపుణ్యం, సమగ్ర అభ్యాస అనుభవాలకు దోహదం చేసే విద్యారంగంలో ఈ సహకార విధానం చాలా కీలకమని అన్నారు. విశ్వవిద్యాలయ వ్యవస్థాపక చాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ రేషియో (జిఇఆర్‌) పెరగాలని అన్నారు. ఆరు దశాబ్దాల క్రితం ఏర్పాటైన రాధాకృష్ణ కమిటీ జిడిపిలో 6 శాతం విద్యకు కేటాయించాలని సూచించిందని, స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా మన ప్రస్తుత జిడిపిలో విద్యకు 3 శాతం కంటే తక్కువగా కేటాయింపులు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వీసీ డాక్టర్‌ ఎస్‌.వి. కోటారెడ్డి, డాక్టర్‌ బుద్ధ చంద్రశేఖర్‌, ప్రొఫెసర్‌ పి.ఉమామహేశ్వరిదేవి, ప్రొఫెసర్‌. రామమోహనరావు, రాష్ట్రంలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్‌ ఛాన్సలర్లు, రాష్ట్రంలోని కేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు.

➡️