విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్‌ఎఫ్‌ఐ

Dec 17,2023 20:30

 ప్రజాశక్తి-నెల్లిమర్ల :  విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ అన్నారు. నెల్లిమర్లలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో ఏ విద్యార్థికి ఎటువంటి సమస్య వచ్చినా మొట్టమొదట స్పందించి ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్న సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అని అన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ జిల్లాలో ఒక ఎమ్మెల్యే కూడా సాధించలేని ఒక కాలేజ్‌ హాస్టల్‌ను ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం జిల్లా కమిటీ పోరాడి సాధించిందని అన్నారు. ఈ ఏడాది కాలంలో చేసిన సైకిల్‌ యాత్రలు, నిరవధిక నిరాహార దీక్షలు విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంచి కృషి చేశాయని తెలిపారు. ఈ ఉద్యమ స్ఫూర్తిని జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు పక్షాన ఆలోచించాలని, జిల్లాలో సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, 2014లో కేటాయించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు తక్షణమే సమకూర్చాలని, మెడికల్‌ కళాశాలలో సీట్ల సంఖ్య పెంచి, డబ్బులతో సీట్లు కొనే ధోరణి మానుకోవాలని అన్నారు. ఖాళీగా ఉన్న లెక్చర పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, పాఠశాలల విలీనాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం ఈ మహాసభల స్ఫూర్తితో అలుపెరుగని పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కరించుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మహాసభల్లో పలు తీర్మానాలు ఆమోదించారు.ఆమోదించిన తీర్మానాలు- జూనియర్‌ కాలేజీలో ఖాళీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి. మధ్యాహ్న భోజనం, పుస్తకాలు పంపిణీ చేయాలి.- బొబ్బిలి , నెల్లిమర్ల ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి. పెంచిన ఫీజులు తగ్గించాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి.- పాఠశాల విలీనం ఆపాలి. నాడు-నేడు వేగవంతం చేయాలి.- ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం చేయాలి.- జెఎన్‌టియుజివికి నిధులు కేటాయించి ప్లేస్‌మెంట్లు కల్పించాలి.- కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం పనులు వేగవంతం చేసి తొందరగా పూర్తి చేయాలి.-  సంక్షేమ హాస్టల్‌లో మెస్‌ ఛార్జీలు పెంచాలి. సొంత భవనాలు ఏర్పాటు చేయాలి, ఖాళీగా ఉన్న వార్డెన్‌ పోస్టులను భర్తీ చేయాలి.- విద్యార్థినులకు హాస్టల్‌లో శానిటరీ నాప్కిన్స్‌ పంపిణీ చేయాలి.- విద్యార్థులు బస్సు పాస్‌ తీసుకుంటున్న ప్రాంతాలకు సమయానికి బస్సు సదుపాయం కల్పించాలి. రాజాంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలి .- ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలో జీవో 107, 108 రద్దుచేసి అందరినీ కన్వీనర్‌ కోటాలోనే సీట్లు భర్తీ చేయాలి.- స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. జిల్లాలో మూతపడిన జ్యూట్‌మిల్లులను తెరిపించాలి.- ప్రత్యేక హోదా , విభజన హామీలను అమలు చేయాలి .- బకాయి ఉన్న విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయాలి.- జీవో నెంబర్‌ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు అమలు చేయాలి.- ఎంఆర్‌ఎ కళాశాలను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి.-ప్రతి నియోజకవర్గ కేంద్రంలోను టెక్నికల్‌ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి.

➡️