విద్యార్థినులకు ఘన సన్మానం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థినులు మిద్య రూపా, సయ్యద్‌ సానియా పార్లమెంటులో అద్భుతంగా ప్రసంగించారు. వీరిని మంగళవారం కళాశాల స్టూడెంట్‌ యూనియన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యువ కేంద్ర యూత్‌ ఆఫీసర్‌ మణికంఠ మాట్లాడుతూ కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి మిద్దె రూప 2022, అక్టోబర్‌ 2న పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో చాలా అద్భుతంగా ప్రసంగించిందని చెప్పారు. ఈ ప్రసంగాన్ని కళాశాలలోని ఇతర విద్యార్థులంతా స్ఫూర్తిగా తీసుకుని ఇకముందు జరిగే పోటీలలో పాల్గొనాలని కోరారు. ఇదే కళాశాలకు చెందిన సయ్యద్‌ సానియా నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ పోటీలలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జాతీయస్థాయిలో ఈనెల 5, 6వ తేదీలలో జరిగిన జాతీయ యువ పార్లమెంటు ఉత్సవంలో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్నలను పొందిందని తెలిపారు. వీరిద్దరి విజయాలను, ప్రసంగాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో జరగబోయే పోటీలలో పాల్గొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో గెలుపొందడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా విజయాలను సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి.సలీం బాషా మాట్లాడుతూ పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ప్రసంగించడం హర్షణీయమన్నారు. తమ కళాశాలలో రూపా, సానియా లాంటి ఆణిముత్యాలు మరెందరో ఉన్నారని వారందరూ కూడా భవిష్యత్తులో మంచి విజయాలను సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సన్మాన గ్రహీతలైన మిద్దరూప, సయ్యద్‌ సానియా మాట్లాడుతూ తాము జాతీయస్థాయిలో విజయం సాధించడానికి తమ తల్లిదండ్రుల, కళాశాల, నెహ్రూ యువ కేంద్ర కషి ఎంతో ఉందని పేర్కొన్నారు. వారికి కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ విజయలక్ష్మి దేవి, డాక్టర్‌ పి.సి దేవి, డాక్టర్‌ గురు మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ కె.వి కష్ణవేణి, కె.వి రమణ, సుబ్బారెడ్డి, శాలిని, రవి శేఖర్‌, నాగవేణి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️