విద్యావ్యవస్థ నిర్వీర్యం

ప్రజాశక్తి -పోరుమామిళ్ల కొంతమందికే చదువు అనే మనుధర్మ సిద్ధాంతాన్ని బిజెపి అమలు చేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని ఆర్‌సిఎం పాఠశాల మైదానంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 27వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు విద్యార్థులతో బహిరంగ సభను జిల్లా అధ్యక్షులు జి.సునీల్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా ఎస్‌ఎ ఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ .రాజేంద్ర ప్రసాద్‌, ఉపాధ్యక్షులు రాహుల్‌, ఎంఆర్‌ నాయక్‌, వినరు, సహాయ కార్యదర్శులు వి.రవి, ఎస్‌ .కరిష్మా, జిల్లా కమిటీ సభ్యులు వై.అజరు కుమార్‌, ఎస్‌.మనోజ్‌, పోరుమామిళ్ల మండల మాజీ కార్యదర్శి ఎన్‌.భైరవ ప్రసాద్‌ హాజర య్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కొంతమందికే చదువు అనే మనుధర్మ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలల సీట్ల భర్తీలో రిజర్వేషన్లు పాటించడం లేదని ప్రశ్నించారు. విద్యా విధానం కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటే దాన్ని మోడీ పూర్తిగా తొలగించి, కేంద్ర జాబితాలోనే పెట్టుకొని ఆశాస్త్రీయమైన కాషాయ విద్య బీజాలు విద్యార్థుల్లోకి చోప్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇది దేశ లౌకిక వ్యవస్థకు, ఫెడరల్‌ వ్యవస్థకు తీవ్ర విఘాతమన్నారు. మేధావుల కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు, రాజకీయ కేంద్రాలుగా మార్చిన ఘనత బిజెపి ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవ చేశారు. కేరళ వామపక్ష ప్రభుత్వం నూటికి 94 శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా దేశం ముందు రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన ‘కొఠారి కమిషన్‌’ కేంద్ర బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని రికమండేషన్‌ చేసిందని, రిపోర్టు వచ్చి 30 ఏళ్లు గడుస్తున్నా 10 శాతం నిధులు కన్నా అదనంగా ఇచ్చింది లేదని పేర్కొన్నారు. కేంద్రంలో పాలన దీర్ఘకాలం సాగించిన ప్రభుత్వాలదే ఈ నేరమన్నారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానని నరేంద్రమోడీ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, 9 సంవత్సరాలు గడిచినా ఉన్న ఉద్యోగాలు పోయాయి కానీ, ఒక్క కొత్త ఉద్యోగం రాలేదని చెప్పారు. జగన్‌ 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చారని మాట తప్పారన్నారు. బిజెపి, వైసిపి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మాట తప్పాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 51- ఏ (హెచ్‌) లో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ శాస్త్రీయ విద్యా దేశ భావిభారత పౌరులకు అందించాలని స్పష్టంగా లిఖిత పూర్వ రాజ్యాంగంలో చేర్చారని, దానికి భిన్నంగా జ్యోతి ష్యం, హస్త సాముద్రికం, చిలక దోషం, రేఖా శాస్త్రాలు, వాస్తు శాస్త్రాలు, వేద గణితాలు లాంటి మూఢనమ్మకాల విద్యను ప్రవేశపెట్టి బోధించే పాలకులు నేడు కేంద్రంలో వచ్చి కూర్చొని పరిపాలన సాగిస్తున్నారని వారు విద్యార్థులకు గుర్తు చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ విద్యార్థుల్లో నిజాయితీ, నిబద్ధత, సామర్థ్యం, పెంపొందించేందుకు కషి చేస్తోందని తెలిపారు. బిజెపి పాలనలో దేశంలోని యూనివర్సిటీలను అగ్రకులాల అగ్రహారాలుగా మార్చి వేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని దించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 90 శాతం కళాశాలలో నాణ్యతలేని విద్యకు, నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారాయి అన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాలలో 11 వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ను నియ మించకుండా యూనివర్సిటీలను సంక్షోభంలోకి ఉద్దేశపూర్వకంగానే నెట్టుతు న్నాయన్నారు. కార్పొరేట్‌ విద్యను, విదేశీ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విద్య వ్యాపారంగా దోపిడీకి కేంద్రాలుగా మార్చిన ఘనత నేటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. విద్యార్థి ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతున్నారని, సైన్సు, హెల్త్‌ రంగాల్లో ఇస్తున్న 92 అవార్డులు రద్దు చేశారని విమర్శించారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ 27వ జిల్లా మహాసభలకు ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు పి.చాంద్‌ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు డి.వెంకటేశు సంఘీభావం మద్దతు తెలియజేశారు.

➡️