వినూత్న రీతిలో అంగన్‌వాడీల నిరసన

Jan 8,2024 21:44
ఫొటో : పొర్లుదండాలు పెడుతూ నిరసన చేపడుతున్న అంగన్‌వాడీలు

ఫొటో : పొర్లుదండాలు పెడుతూ నిరసన చేపడుతున్న అంగన్‌వాడీలు
వినూత్న రీతిలో అంగన్‌వాడీల నిరసన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన అంగన్‌వాడీల రాష్ట్రవ్యాప్త సమ్మెలో 28వ రోజు సోమవారం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పొర్లుదండాలు పెడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వజ్రమ్మ, రఘురావమ్మ, సుభాషిణి, విజయలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చెప్పిన హామీని అమలు చేయమని 28 రోజులుగా రోడ్లపై నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి తమకు నోటీసులు ఇవ్వడం, ఉద్యోగాలు తీసేస్తామని ఇంకా అనేక రకాలుగా బెదిరిస్తూ ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి తమపై నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూడడం ప్రభుత్వం మానుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించిన తమకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. అంగన్‌వాడీల ఆందోళన శిబిరం వద్దకు మాజీ ఎంఇఒ కన్నయ్య, జన విజ్ఞాన వేదిక నాయకులు హరినారపరెడ్డి, వచ్చి వారి మద్దతును తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.పెంచలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాల్యాద్రి, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️