విమానాశ్రయ భూముల్లో ఆర్‌డిఒ పర్యటన

Feb 6,2024 21:14

 ప్రజాశక్తి – భోగాపురం :  రైతుల సమస్యలపై విమానాశ్రయ భూముల్లో ఆర్‌డిఒ సూర్యకళ మంగళవారం పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర హౌసింగ్‌ బోర్డ్‌ డైరెక్టర్‌, ఎ.రావివలస సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ బైరెడ్డి యర్రప్పల నారాయణ సోమవారం స్పందనతో పాటు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుకు, ఆర్డీవోకు సోమవారం ఫిర్యాదు చేశారు. అప్రోచ్‌ రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణంతో వివిధ గ్రామాలకు, శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్‌డిఒ స్పందించి మంగళవారం సంబంధిత గ్రామాల్లో పరిశీలించారు. అప్రోచ్‌ రోడ్డు నిర్మాణంలో రైతుల సమస్యలను పరిగణలోకి తీసుకొని ఒక మ్యాప్‌ తయారు చేయాలని జిఎంఆర్‌ సంస్థ ప్రతినిధి సుబ్బారావుకు ఆదేశించారు. అప్రోచ్‌ రోడ్‌ కి సంబంధించిన పరిహారం విశాఖ ట్రిబ్యునల్‌ కోర్టులో జమ చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఉప్పాడ శివారెడ్డి, బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఆర్‌డిఒ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు. తహశీల్దార్‌ శ్యాం ప్రసాద్‌, సర్వేయరు ముదికేశ్వరరావు, విఆర్‌ఒ తదితరులు పాల్గొన్నారు. పరిహార తేల్చకపోతే అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణం అడ్డుకుంటాం విమానాశ్రయం అప్రోచ్‌ రోడ్డుకు సంబంధించిన పరిహారం కోర్టులో వేయడం వలన ఇబ్బందులు పడుతున్నామని బైరెడ్డి పాలెం గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు అనే రైతు అధికారుల ముందు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరిహారం తేల్చకపోతే అవసరమైతే అప్రోచ్‌ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలిపాడు.

➡️