విలువలు కోల్పోయి ఆరోపణలు : కోలగట్ల

Feb 17,2024 20:33

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ : టిడిపి నిర్వహించిన శంఖారావం సభలో తాను నగరంలో గంజాయి రవాణను ప్రోత్సహిస్తున్నట్లు నారా లోకేష్‌ చెప్పడాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. శనివారం కంటోన్మెంట్‌ వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై కొన్ని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం, విచారకరమని అన్నారు. ఓట్లు కోసం ఇంత దిగజారి పోయి ఆరోపణలు చేయడం దారుణమని, గంజాయి వ్యాపారం చేస్తున్నామని చేసిన ఆరోపణలు నిజమైతే ప్రజలు తమకు ఓట్లు వేయొద్దని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్‌ వ్యాపారం చేసిన మీరు తమపై ఆరోపణలు చేయడం మానుకోవాలని కోలగట్ల అన్నారు. గుంకలాం, సారిక, కొందకరకాం భూములు కొనుగోలులో అక్రమాలు చేసినట్లు చేసిన ఆరోపణలను రుజువు చెయ్యగలరా అని సవాల్‌ విసిరారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక, 63 ఏళ్ల వయసులో జల క్రీడ చేస్తే దానిపై వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర మంత్రి గా,రాష్ట్ర మంత్రిగా అశోక్‌గజపతిరాజు విజయనగరం పట్టణాన్ని ఏం అభివృద్ధి చేసారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నగరంలో తమ హయాంలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్రజలను ఓట్లు అడిగే దమ్ము టిడిపి నాయకులకు ఉందా అన్నారు. తెలుగుదేశం నాయకులకు ఉందా? అంటూ ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు ఎ.వేణు, మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌ వి వి రాజేష్‌, డాక్టర్‌ విఎస్‌ ప్రసాద్‌, ఎంపిపి మామిడి అప్పలనాయుడు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

➡️