వీడని కష్టాలు.. తప్పని నష్టాలు..

Mar 21,2024 22:22

తెగుళ్లు సోకిన మిర్చి పైరు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సరైన వర్షాల్లే ఒకేడాది.. మద్దతు ధరలు దక్కక మరో ఏడాది.. నకిలీ విత్తనాలు, పురుగు మందుల బారిన పడి ఇంకో ఏడాది… గెగుళ్ల వల్ల మరో ఏడాది ఇలా ఏటికేడు మిర్చిరైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా అవి తిరిగి రాక అప్పులపాలవుతున్నారు. ఈ అప్పుల చిక్కుల్లో కూరుకుపోయిన కొందరు వాటి నుండి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
పల్నాడు జిల్లాలో ఈ ఏడాది సుమారు లక్షా 12 వేల 500 ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖాదికారుల లెక్కలు చెబుతున్నాయి. సాగుదార్లలో 70 శాతానికి పైగా కౌలురైతులే ఉన్నారు. జిల్లాలో గత ఐదేళ్లలో 70 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీరిలో 90 శాతం మంది కౌల్దార్లే కావడం గమనార్హం. అయితే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి సాయమేమీ అందలేదు.ఈ ఏడాది కూడా మిర్చి పంటలను మిచౌంగ్‌ తుపాను తుడిచిపెట్టింది. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలో మినుము, కంది, శనగ సాగు చేసిన రైతులు సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. పైగా వీరంతా పొలాలను దున్ని మళ్లీ మిర్చి సాగు చేయగా ఆ పైరుకు తామర పురుగు, బొబ్బర తెగుళ్లు సోకటంతో మరింత అప్పుల్లో దిగబడ్డారు. ప్రభుత్వం కూడా నీటిపారుదల, వర్షాధారం తదితర సాకులతో పొలాలను బీమా పథకానికి ఎంపిక చేయకపోవడంతో రైతులకు అత్తెసరు సాయమైనా అందలేదు.
ఫలితం.. రూ.1.60 లక్షల నష్టం
బొబ్బాల వెంకటరావు, కౌలురైతు, కాకాని, నరసరావుపేట మండలం.
రెండెకరాల్లో మిర్చి సాగు చేస్తే పెట్టుబడులకు రూ.4 లక్షలయ్యాయి. 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నాణ్యత లేమితో రూ.16 వేలు చొప్పున కొనుగోలు చేశారు. పంటకు ధర వచ్చేదాక నిల్వ చేద్దామంటే అప్పులకు వడ్డీలు పెరుగుతాయనే భయంతో అప్పటికి ఉన్న ధరకే పంటను అమ్మాను.రూ.2.80 లక్షలు వచ్చాయి. పెట్టుబడి వడ్డీలు లెక్క చూస్తే రూ.1.60 లక్షలు నష్టం మిగిలింది.
పంట చేతికొచ్చాక పడిపోతున్న ధరలు
మండాది చక్రవర్తి, బొగ్గరం, ఈపూరు మండలం.
మిర్చి పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోతున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో అదేమీ లేదు. నీటి ఎద్దడి ఉన్నా సమీపంలోని బోర్ల నుండి వచ్చే నీటిని నిల్వచేసి ఇంజన్‌ ద్వారా మిర్చి పొలాలకు పెట్టాం. ఒకవైపు తెగుళ్లు మరొకవైపు మార్కెట్‌ మాయాజాలంతో ఇబ్బందులు తప్పడం లేదు.
మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వై.రాధాకృష్ణ, కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు.
తెగుళ్ల బారినపడి పంట నష్టపో యిన మిర్చి రైతులను ప్రభుత్వం తక్షణ మే ఆదుకోవాలి. రూ.లక్షల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి చేతికొచ్చే సమయంలో బొబ్బర తెగులు, తామర పురుగు సోకడంతో దిగుబడి తగ్గింది. వచ్చిన దిగుబడి కూడా నాణ్యత లేకపోవ డంతో పెట్టుబడులైనా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా తెగుళ్ళతో 5-10 క్వింటాళ్లు మాత్రమే వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి.
బీమా సౌకర్యం కల్పించాలి
ఏపూరి గోపాలరావు, రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి.
తామర పురు గు, బొబ్బర తెగుళ్ల తో మిర్చి పంట 90 శాతం పైగా దెబ్బతింది. సాగు నీటి వసతి ఉన్న భూములకు బీమా సౌకర్యం లేకుండా చేయడం తగదు. మిర్చి సాగుచేసిన రైతులందరికీ వాతా వరణ బీమా సౌకర్యం కల్పించాలి. సాగర్‌ నీరు లేకున్నా ట్యాంకర్‌ల ద్వారా నీటిని కొని మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

➡️