‘వెలిగొండ’ పూర్తి కాకుండానే జాతికి అంకితమా: సిపిఎం

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనం సిపిఎం కనిగిరి పట్టణ కమిటీ జనరల్‌ బాడీ సమావేశం బుధవారం ఎస్‌కె బషీర అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా జాతికి అంకితం చేస్తామని వైసిపి ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంకా 40 శాతం పనులు మిగిలి ఉన్నాయని, ఎన్నికల లబ్ధి కోసం పశ్చిమ ప్రకాశం ప్రజలను మోసగించేలా వైసిపి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. శాసనసభలో ప్రకటించిన గడువులు అన్నీ అయిపోయాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం కూడా అందించలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు మొదటి దశ పనులు అని కూడా దాచిపెట్టి మభ్యపెడుతూ తమ వైఫల్యాలను వైసీపీ ప్రభుత్వం కప్పిపుచ్చుకుంటోందని దుయ్యబట్టారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, మోసగించిన వైసీపీ ప్రభుత్వానికి తప్పక గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి పిసి కేశవరావు, నాయకులు ఆర్‌ ఏడుకొండలు, శాంతకుమారి, ప్రసన్న, వెంకటమ్మ, ఎలీషమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️