వేలిముద్ర వేయించారు..రేషన్‌ ఇవ్వడం మానేశారు

Mar 6,2024 21:06

 ప్రజాశక్తి – కురుపాం :  వేలిముద్ర వేయించి స్లిప్పు ఇచ్చి మూడు నెలలుగా రేషన్‌ అందించడం లేదు. డిసెంబర్‌, ఫిబ్రవరి నెలల్లో అరకొరగా కొందరికి ఇచ్చినా, జనవరిలో పూర్తిగా రేషన్‌ ఇవ్వడం మానేశారు. ఈ సంఘటన మండలంలో ఏగులవాడ పంచాయతీలో చోటుచేసుకుంది. దీంతో గత్యంతరం లేక ఆ పంచాయతీకి చెందిన రేషన్‌కార్డుదారులు బుధవారం తహశీల్దార్‌ సత్యనారాయణకు సమస్యను విన్నవించుకునేందుకు కురుపాం వచ్చారు. తహశీల్దార్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉండటంతో గంటల తరబడి నిరీక్షించారు. అనంతరం తహశీల్దార్‌ సమావేశం నుంచి బయటకు వచ్చాక ఆయనకు వినతి అందించారు. తమ డిపో పరిధిలో సేల్స్‌మెన్‌ వేలిముద్రలు వేయించి సిప్పులు ఇచ్చి రేషన్‌ ఇవ్వడం లేదని వాపోయారు. రేషన్‌ పంపిణీ చేసేలా చూడాలని కోరారు. అనంతరం ఆర్‌ఐ కరుణాకర్‌ను ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా, ఆ గ్రామానికి ఉప తహశీల్దార్‌ను పంపించామని, అందరికీ రేషన్‌ అందేలా చూస్తామని తెలిపారు.

➡️