వైద్యపరీక్షలు తప్పనిసరి

Jan 29,2024 21:06

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జ్వరాలతో బాధపడే రోగులకు వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని డోకిశీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల ఆరోగ్య తనిఖీల రికార్డులను పరిశీలించి నమోదు చేసిన అనారోగ్య సమస్యలు, అందజేసిన చికిత్సా వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. జ్వరంతో ఆసుపత్రికి ఎవరు వచ్చినా జ్వర లక్షణాలను స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలు నమోదు చేసి తగు చికిత్స అందజేయాలని ఆదేశించారు. పిహెచ్‌సి పరిధిలో మారుమూల గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నందున ఏ సమయం లోనైనా వైద్య సేవలు అందజేసేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ల్యాబ్‌ పరీక్షల రికార్డులు తనిఖీ చేసి నమోదు చేసిన రక్త నమూనాల వివరాలు పరిశీలించారు. మైక్రోస్కోప్‌ పనితీరు గమనించారు. జ్వరాలు గుర్తించిన వెంటనే క్షేత్ర స్థాయి సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేసి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఎం.కౌశిక్‌, ఎఎంఒ సూర్యనారాయణ, సూపర్‌వైజర్లు శ్రీనివాస్‌ రావు, కృష్ణంరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️