వైసిపిలో సిట్టింగులకే అవకాశం ?

Mar 15,2024 20:30

టిడిపిలో మూడు చోట్ల వీడని చిక్కుముడి

నేడే ఎన్నికల నోటిఫికేషన్‌
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరపున దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలకే మరోసారి అవకాశం దక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఒకింత దీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. శనివారం ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ వైసిపి అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో జిల్లాలో దాదాపు రెండు నెలలుగా రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. వైసిపి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చాలా వరకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. ఎస్‌.కోటలో స్థానిక ఎమ్మెల్యేను మార్చాలంటూ ఎమ్మెల్సీ రఘురాజు పట్టుబట్టినప్పటికీ అందుకు అధిష్టానం ససేమిరా అంటూ తేల్చేసింది. ఇక రాజాంలో మాత్రం కంబాల జోగులను తప్పించి వేరొకరిని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. జోగులకు పాయకరావుపేట ఇన్‌ఛార్జిగా అవకాశం కల్పించారు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు వైసిపిలోనూ కీలకంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రెండు జిల్లాలకు చెందిన ఎమ్‌పి, ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం లేదని అధిష్టానానికి చెప్పినట్టు, గెలిపించే బాధ్యత తాను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్టు చర్చనడుస్తోంది. మరోవైపు జిల్లా పార్టీని సమన్వయం చేస్తున్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కూడా ఈసారి చట్టసభల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ, ఈసారి పోటీలో కాకుండా పార్టీ విజయానికి కృషిచేయాలని పార్టీ అధినేత సూచించినట్టుగా సమాచారం. ఈ విధంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు యథాతథంగా కొనసాగితే ఈ రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఆయనకు దక్కే పరిస్థితి లేదు. రాజాం ఖాళీ అయినప్పటికీ అక్కడ రిజర్వేషన్‌ అనుకూలించదు. ఒకానొక దశలో ఎంపీ టిక్కెట్‌ శ్రీనివాసరావుకు కట్టబెడతారని చర్చ జరిగినప్పటికీ, ఎంపీ స్థానానికి, జెడ్‌పి పీఠానికి ముడిపెట్టడంతో చిన్నశ్రీను వెనక్కి తగ్గినట్టుగా చర్చనడుస్తోంది. ఎంపీగా పోటీచేసేందుకు బెల్లానకు మరో అవకాశం దక్కినట్టుగానే కనిపిస్తోంది. మరోవైపు టిడిపిలో చీపురుపల్లి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపేందుకు అధిష్టానం నిర్ణయం చేయగా, ప్రత్యర్థిగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి ఆయన సాహశించడం లేదని సమాచారం. ఒకవేళ గంటా అక్కడి నుంచి సిద్ధపడకపోతే ఆయనకు మరోచోట అవకాశం కల్పించకపోవచ్చనే చర్చ నడుస్తోంది. గంటా నిర్ణయాన్ని బట్టి చీపురుపల్లిలో ప్రత్యామ్నాయం ఎవరనేది ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఎస్‌.కోటలో సీనియర్‌ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సీటు ఆశిస్తుండగా ఎన్‌ఆర్‌ఐల సహకారంతో గొంప క్రిష్ట పోటీ పడుతున్నారు. అధిష్టానం ఇంతగా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొత్త ముఖం అనివార్యమేనా? అంటూ ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి. అటు పాలకొండలో జయకృష్ణతోపాటు మరికొందరు నాయకులు సీటుకోసం తహతహలాడుతున్నారు. మరోవైపు శనివారం మధ్యాహ్నం 3గంలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తక్షనమే ఎన్నికల మోడల్‌ కోడ్‌ అమలు లోకి రానుంది. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి కూడా ప్రకటన చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోనుంది.

➡️