వైసిపి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోంది : లోకేష్‌

Feb 15,2024 20:36

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఓటమి భయంతో వణికిపోతున్న వైసిపి ప్రభుత్వం, సిఎం జగన్మోహన్‌రెడ్డి త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. ఇందుకే ప్రభుత్వ సలహాదారుగావున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో తలపెట్టిన శంఖారవం సభలు రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో గురువారం జరిగాయి. ఆ సభల్లో లోకేష్‌ మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి 3 స్థానాల్లో గెలిచింది. అప్పుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వీళ్లు అసలు మా ఓటర్లే కాదన్నారు. అప్పుడు అర్థమైంది వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని’ అంటూ విమర్శించారు. సజ్జలకు మంగళగిరిలో ఒకటి, పొన్నూరులో మరొకటి చొప్పున రెండు ఓట్లు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసే పరిస్థితి ఉందంటూ ప్రభుత్వం ఎంత ఓటమి భయపడుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లతో గెలిచారని, దొంగ ఓట్లు చేర్పించే అధికారులపై చర్యల తప్పవని తాను ఆ రోజే చెప్పానని అన్నారు. తాను చెప్పిన విధంగానే అక్రమాలకు పాల్పడిన ఓ ఐఏఎస్‌ను, డిఎస్‌పి, సిఐలను, ఎస్‌ఐలను ఇసి సస్పెండ్‌ చేసిందని అన్నారు. రేపోమాపో మరికొందరిపైకూడా చర్యలు తీసుకుంటారని అన్నారు. ‘ముఖ్యమంత్రి జగన్‌ ఓ 420… ఆయనపై 420 కేసులు 28 ఉన్నాయి’ అని విమర్శించారు. ఆయనకు సజ్జల రామకష్ణారెడ్డి ఇచ్చేవన్నీ పనికిమాలిన సలహాలేనని అన్నారు. ఆ సలహాలతోనే ఇప్పటివరకు జీతాల పేరుతో రూ.150 కోట్లు లూటీ చేశారని విమర్శించారు. తాను అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకుంటే జగన్‌రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకున్నారని, తాను జనంలో తిరుగుతుంటే, జగన్‌ పరదాల చాటున పర్యటనలు చేస్తున్నారని లోకేష్‌ ఎద్దేవా చేశారు. తాను స్టాన్‌ ఫోర్ట్‌ లో ఎంబియే చదివితే జగన్‌ టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ కేసులో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారని, తనకు క్లాస్‌ మేట్స్‌ ఉంటే జగన్‌కు జైలుమేట్స్‌ ఉన్నారని విమర్శించారు. జగన్‌ మంత్రివర్గానికి దేశంలోనే చెత్తకేబినెట్‌గా అవార్డు వచ్చిందన్నారు. మంత్రులు వారికి కేటాయించిన శాఖలు కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆర్థికమంత్రి బుగ్గన తెల్లవారితే అప్పుల అప్పారావు మాదిరిగా ఢిల్లీ చుట్టూ తిరుతుతాడని, పాపాల పెద్దిరెడ్డి మద్యం విక్రయాల్లో బిజి అయిపోయారని అన్నారు. కోర్టు ఫైళ్లు కొట్టేసిన కాకాని గోవర్థన్‌ రెడ్డి. పిల్ల కాలువలు తవ్వలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు వ్యవసాయ, ఇరిగేషన్‌ శాఖ మంత్రులుగా ఉండడం సిగ్గుచేటన్నారు. సొంత ఊళ్లో ధాన్యం సంచులు ఇవ్వేలని ఎర్రిపప్ప పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘాటుగా విమర్శించారు. పిల్లలు బాగా చదవకపోవడం వల్లే ఉద్యోగాలు రాలేదన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమలు ఎప్పుడు తీసుకువస్తారంటే కోడి ముందు వచ్చిందా, గుడ్డు వచ్చిందా అని సొల్లు కబుర్లు చెప్పే పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్‌ నాథ్‌ వంటి ఎంతో అద్భుతమైనవారు జగన్‌ కేబినెట్‌లో ఉన్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అని బోర్డులు పెట్టించుకుంటున్న జగన్‌ తన సొంత తల్లి, చెల్లినే నమ్మడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు వారిని గ్రామాల్లో తిప్పించి, ఎన్నికల తర్వాత గెంటేశారని అన్నారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతర మహిళలకు ఎలా న్యాయం చేస్తారో ఆలోచించాలని అన్నారు. ఈ సభల్లో టిడిపి చీపురుపల్లి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు కిమిడి నాగార్జున, కోండ్రు మురళీమోహన్‌, ఆయా నియోజకవర్గాల జనసేన సమన్వయ కర్తలు శ్రీనివాసరావు, వై.రాజు పాల్గొన్నారు.

➡️