వైసిపి పాలనలో ప్రజాధనం దోపిడీ

Feb 17,2024 20:23

ప్రజాశక్తి – లక్కవరపుకోట, వేపాడ  : వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించుకొని వేల కోట్లు ప్రజధనాన్ని దోపిడీ చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. శనివారం ఎస్‌.కోట నియోజకవర్గం సోంపురం జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ఇసుక దందా, గంజాయి , నాసిరక మద్యం వ్యాపారాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఎద్దేవా చేశారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే 25 ఎకరాల భూమిని ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. పెందుర్తి నుండి ఎస్‌.కోట మీదుగా అరకు వెళ్లే ప్రధాన రహదారి ఆరు లైన్ల పనులు గాలికి వదిలేసారన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలను కొల్లగొడుతున్నారని అన్నారు. ఈ జిల్లాను అభివృద్ధి చేసింది టిడిపియేనని జిల్లాలో రోడ్లు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుపేదలకు సొంత ఇళ్లు కట్టింది తమ పార్టీయేనని తెలిపారు. ఎస్‌.కోటలో రూ.2వేల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పెందుర్తి-అరకు రోడ్డును 6 లైన్ల రోడ్డుగా చేస్తానని చెప్పిన జగన్‌ ఆ తరువాత పట్టించుకోలేదన్నారు. భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని డబ్బులిచ్చి తెరిపిస్తానని చెప్పాడని, కానీ మనం ఇచ్చిన రూ.13 కోట్లు లాగేసుకుని షుగర్‌ ఫ్యాక్టరీని చంపేశాడని అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌ – 6 హామీలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రచారం చేస్తామని కార్యకర్తలతో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నియోజకవర్గంలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ’ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన 50 మందికి లోకేష్‌ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక రాక్షసుడు పాలిస్తున్నాడని, ఒక్క అవకాశం పేరుతో అందరూ మోసపోయారని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వానికి ఓటుతో బుద్ది చెప్పి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఐదేళ్లుగా రాష్ట్రంతోపాటు ఎస్‌.కోట నియోజకవర్గం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని, రెండు చెరువులను కబ్జా చేశారని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎస్‌.కోటను విశాఖజిల్లాలో చేర్చాలని కోరారు. జనసేన సమన్వయకర్త సత్యనారాయణ మాట్లాడుతూ విధ్వంసక పాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు జనసేన-టిడిపి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఇరుపార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. సభలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు , పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరాంప్రసాద్‌, జనసేన ఎస్‌.కోట సమన్వయకర్త ఒబ్బిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గిరిజన తాండాలకు రోడ్డుసౌకర్యం కల్పిస్తాంతమ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో అనారోగ్య సంభవించినపుడు ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని మూలబొడ్డవరం, చిట్టంపాడు గ్రామస్తులు లోకేష్‌ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డు మంజూరు చేస్తామని వైసిపి ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినా ఎటువంటి చొరవా చూపలేదన్నారు. తమ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో కొండపైకి వాహనాలు వెళ్లలేవని చెబుతూ ఇటీవల సంభవించిన ఘటనను వివరించారు. దీంతో లోకేష్‌ స్పందిస్తూ అధికారంలోకి రాగానే గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని, అత్యవసర సేవలకోసం ఫీడర్‌ అంబులెన్స్‌ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యువనేతకు వినతుల వెల్లువ నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. శంఖారావం సభకు ముందు వారు వినతిపత్రాలు సమర్పించారు. ఆదరణ పథకం కింద సైకిల్‌ తో పాటు రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం ప్రతినిధులు కోరారు. బ్యాంకు లింకేజీ లేకుండా 90శాతం సబ్సీడీతో రుణాలు మంజూరు చేయాలని, తెలంగాణలో మాదిరిగా నీరాకేఫ్‌లు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిటీ భవనాల నిర్మాణంతో పాటు నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నూతన వసతి గృహాలు నిర్మించాలని నియోజకవర్గ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు కోరారు. కొత్తవలసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జామిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. జీవో 104 ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు.

➡️