వైసిపి మంగళగిరి ఇన్‌ఛార్జిగా లావణ్య

Mar 1,2024 23:53

సిఎంను కలిసిన లావణ్య, హనుమంతరావు, ఆర్కే, కమల
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
వైసిపి మంగళగిరి సమన్వయకర్తను మార్చారు. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూమార్తె అయిన లావణ్యను నూతన సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు వైసిపి కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గంజి చిరంజివిని ఎంపిక చేశారు. రెండునెలలు తిరగకుండానే చిరంజీవిని మార్పు చేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు కుటుంబానికి చెందిన లావణ్యను ఎంపిక చేయడంతో పార్టీలో నెలకొన్న అంతరాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో ఈ రెండు కుటుంబాలకు పట్టుందని భావించి లావణ్యను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. టిడిపి నుంచి నారా లోకేష్‌ పోటీ చేస్తుండంతో ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం జగన్‌ చేనేత వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో తొలుత గంజి చిరంజీవిని ఎంపిక చేసినా ఆయనతో నాయకులకు సమన్వయం పెరగడం లేదని భావించి లావణ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళగిరికి చెందిన నాయకులతో కీలక నేతలు చర్చలు జరిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి చర్చల్లో పాల్గొన్నారు. పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత చిరంజీవికి మరో అవకాశం ఇస్తామని పార్టీ జిల్లా సమన్వయకర్త విజయసాయిరెడ్డి భరోసా ఇవ్వగా చిరంజీవి అంగీకరించినట్టు తెలిసింది. చిరంజీవి రెండునెలలుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నా ప్రజల నుంచి సానుకూలత రావడం లేదని ఐ ప్యాక్‌ సర్వే బృందాలు నిర్ధారించడం వల్ల అధిష్టానం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

➡️