వ్యక్తిగత ఆరోగ్యం పై ప్రజలకు అవగాహన : డిఎంఒ

Mar 18,2024 21:50

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ, అందుబాటులో ఉన్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా మార్గ నిర్దేశం చేసి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కృషి చేయాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు అన్నారు. స్థానిక వైద్య, ఆరోగ్య కార్యాలయంలో సిహెచ్‌ఒ (ఎంఎల్‌హెచ్‌పి)లకు కేర్‌ కంపానియన్‌ ప్రోగ్రాం (సిసిపి)పై సోమవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ శిక్షణను డాక్టర్‌ వి.కమల్‌నాథ్‌, సిసిపి టెక్నికల్‌ కన్సల్టెంట్‌ ఎం.మణి పవర్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. బ్యాచ్‌ల వారీగా ఈనెల 26 వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్మోహన్‌ మాట్లాడుతూ సిహెచ్‌ఒలు శిక్షణలో పొందిన పరిజ్ఞానంతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు గాను సిహెచ్‌ఒలు, వారి పరిధిలో ఉండే గ్రామస్తుల ఆరోగ్యానికి సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, దీర్ఘ కాలిక రోగులు, పిల్లలు, కిశోరబాలికల ఆరోగ్య నివేదికలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హైరిస్క్‌ సమస్యలను గుర్తించి వాటిని నివారించే కార్యాచరణ చేపట్టాలన్నారు. పలు ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలను సులభంగా తెలుసుకొనేలా చిత్రాలతో సూచించిన ఫ్లిప్‌చార్ట్‌ ల ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. దీనివల్ల ప్రజలు వారి ఆరోగ్య స్థితిని స్వయంగా పున్ణపరిశీలించుకునేందుకు దోహదపడుతుం దన్నారు. చికిత్స తర్వాత ఆసుపత్రుల నుండి డిశ్చార్జి అయిన రోగులకు క్షేత్ర స్థాయిలో ఆరోగ్య పరిశీలన చేస్తూ, త్వరగా కోలుకొని ఆరోగ్యకరమైన స్థితి పొందేలా చూడాలన్నారు. రక్తహీనత నివారణ, పౌష్టికాహారం, గర్భిణీలు, శిశువుల్లో హైరిస్క్‌ సమస్యలు గుర్తించడం, శిశువుకు తల్లిపాలు ఇచ్చే పద్ధతులు, ఆవశ్యకతపై బాలింతలకు అవగాహన కల్పించడం, దీర్ఘకాలిక రోగాలైన బిపి, షుగర్‌, గుండె, శ్వాస సమస్యలు, క్యాన్సర్‌ మొదలగు వారి ఆరోగ్య పర్యవేక్షణ, బాల్య వివాహాలు వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్ప్రభావాలు ప్రజలకు వివరించాలన్నారు. అలాగే కిశోర బాలికల్లో రక్త హీనత నివారణ, స్త్రీ, పురుష లింగ నిష్పత్తి సమానత్వం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సాధారణంగా ప్రబలే పలు వ్యాధుల పట్ల అవగాహన కల్పించి, అప్రమత్తం చేయడం మొదలగు అంశాలపై దృష్టి సారించి ప్రజల ఆరోగ్యవృద్ధికి కృషి చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహద పడుతుందని అన్నారు. శిక్షణలో పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి మండలాలకు చెందిన హెల్త్‌ వెల్నెస్‌ కేంద్రాల సిహెచ్‌ఒలు, తదితరులు పాల్గొన్నారు.

➡️