వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్‌

Feb 2,2024 23:09

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌: వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం ప్రశేపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ఉందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బడ్జెట్‌కు నిరసనగా వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. తొలుత సంఘం కార్యాలయం వద్ద నుండి జాతీయ రహదారి వరకు ప్రదర్శన చేశారు. అనంతరం బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా పార్లమెంటులో మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి, రైతులను మోసం చేశారని విమర్శించారు. కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని నష్టపరిచే బడ్జెట్‌ ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఒకవైపున వ్యవసాయ రంగం దివాళా తీస్తుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు దేశ సంపదను దోచిపెడుతోందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించే నరేంద్ర మోడీ మోసకారి బడ్జెట్ను యావత్‌ రైతాంగం వ్యతిరేకిస్తుందని చెప్పారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కోతలు విధించడం సరైనది కాదన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.శివశంకరరావు, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూడి గోపాలరావు, నాయకులు డి.వెంకటరెడ్డి, పి.కృష్ణ పాల్గొన్నారు.

➡️