వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యదర్శిగా రవిబాబు

Mar 13,2024 22:03

సమావేశంలో మాట్లాడుతున్న వి.శివనాగరాణి… ఇన్‌సెట్లో ర‌విబాబు
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా జి.రవిబాబు ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక పుతుంబాక భవన్లో సంఘం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి.శివనాగరాణి మాట్లాడుతూ వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, భూముల నుండి రైతులను, కూలీలను తరిమేసి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా గురువారం సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ సభ, ర్యాలీ, వీటికి సంఘీభాంగా జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు జరుగుతాయని చెప్పారు. ఈ ఆందోళనల్లో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలని, ఏడాదిలో 200 పనిదినాలతోపాటు రోజు కూలి రూ.600 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రవిబాబు మాట్లాడుతూ వ్యవసాయ కూలీల్లో 70 శాతం మహిళలేనని, వారిని సరైన కూలి దక్కాలని అన్నారు. వారి సమస్యలపై ప్రత్యేకంగా పోరాడతామన్నారు. ఈ సందర్భంగా సంఘానికి ఇప్పటి వరకూ కార్యదర్శిగా పని చేయడంతోపాటు 36 ఏళ్లుగా వ్యవసాయ కార్మిక ఉద్యమంలో పని చేసిన ఎ.లక్ష్మీశ్వరరెడ్డికి సమావేశం ధన్యవాదాలు తెలిపింది. సమావేశంలో నాయకులు కె.నాగేశ్వరరావు, జె.భగత్‌, డి.అప్పారావు, కె.నాగేశ్వరరావు, డి.పేతురు, ఎ.వెంకటేశ్వర్లు, షేక్‌ ముస్తఫా, బి.బాలకోటయ్య, టి.రాము, బి.వెంకటేశ్వర్లు, ఎన్‌.వెంకటేశ్వరరాజు, జె.రాజకుమార్‌ పాల్గొన్నారు.

➡️